తగ్గుతున్న సెకండ్ వేవ్ ప్రభావం

తగ్గుతున్న సెకండ్ వేవ్ ప్రభావం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. సెకండ్ వేవ్‌‌ వ్యాప్తిని తగ్గించడంలో, పరిస్థితులను అదుపు చేయడంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా నియంత్రణలను మరికొంత కాలం ఇలాగే కొనసాగిస్తే వైరస్ ప్రభావాన్ని మరింతగా తగ్గించొచ్చునన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్న వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు. 

దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌‌లలో కొంత భాగం రాష్ట్రాలకు, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉందని వీకే పాల్ పేర్కొన్నారు. దాని నుంచి తీసుకుని వ్యాక్సినేషన్ కొనసాగించవచ్చన్నారు. దేశ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో రాష్ట్రాలకు తెలుసునన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు.. దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ లో 50 శాతం డోసులను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. మరో 50 శాతం వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు అక్కడ వ్యాక్సిన్ కొనుక్కోవచ్చన్నారు.