వింబుల్డన్‌‌‌‌ లో ఏడోసారి గెలిచిన జొకోవిచ్

వింబుల్డన్‌‌‌‌ లో ఏడోసారి గెలిచిన జొకోవిచ్
  • ఫైనల్లో కిరియోస్‌పై విజయం

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌:  వీసా సమస్య కారణంగా ఈ సీజన్‌‌‌‌ ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఆడుగే పెట్టలేకపోయినా .. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోనే వెనుదిరిగినా.. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ కోల్పోయినా.. తన ఆటలో వన్నె తగ్గలేదని సెర్బియా టెన్నిస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ నిరూపించాడు. గ్రాస్‌‌‌‌ కోర్టులో తనదైన క్లాస్‌‌‌‌ ఆటతో అలరిస్తూ  వింబుల్డన్‌‌‌‌   చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఏడోసారి విజేతగా నిలిచాడు. కెరీర్​లో 21వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించాడు. ఆదివారం ఇక్కడి సెంటర్‌‌‌‌ కోర్టులో జరిగిన ఫైనల్లో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో నిక్‌‌‌‌ కిరియోస్‌‌‌‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి సెట్‌‌‌‌ కోల్పోయి తడబడినా తనదైన స్టయిల్లో పుంజుకున్న నొవాక్‌‌‌‌.. ఏస్‌‌‌‌లతో హడలెత్తించిన ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ నిక్‌‌‌‌ పని పట్టాడు. దాంతో, వరుసగా నాలుగో ఏడాది వింబుల్డన్‌‌‌‌లో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ఏడు టైటిల్స్‌‌‌‌తో పీట్‌‌‌‌ సంప్రాస్‌‌‌‌ రికార్డును సమం చేసిన సెర్బియా స్టార్‌‌‌‌.. ఇక్కడ అత్యధికసార్లు విజేతగా నిలిచిన రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌ (8 టైటిళ్లు)కు చేరువయ్యాడు. అదే సమయంలో కెరీర్‌‌‌‌లో 21వ గ్రాండ్‌‌‌‌స్లామ్ ఖతాలో వేసుకొని ఫెడరర్‌‌‌‌ (20)ను దాటేశాడు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ గ్రేటెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ (22 గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌)ను అందుకునేందుకు మరో టైటిల్‌‌‌‌ దూరంలో నిలిచాడు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో నొవాక్‌‌‌‌ 15 ఏస్‌‌‌‌లు కొట్టగా.. కొరియోస్ ఏకంగా 30 ఏస్‌‌‌‌లతో అలరించాడు. ఇద్దరూ చెరో ఏడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేయగా.. జొకో 17, నిక్‌‌‌‌ 33 అనవసర తప్పిదాలు చేశారు. కిరియోస్‌‌‌‌తో పోల్చితే (62).. జొకో (46) తక్కువ విన్నర్లు కొట్టినప్పటికీ రెండు బ్రేక్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌ సాధించాడు. నిక్‌‌‌‌  ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ మాత్రమే నెగ్గాడు.  

తడబడి.. చెలరేగి

క్వార్టర్స్‌‌‌‌, సెమీస్‌‌‌‌ మాదిరిగా ఫైనల్లోనూ తొలి సెట్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌ తడబడ్డాడు. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ కిరియోస్​ భారీ సర్వీసులు, ఏస్‌‌‌‌లతో అదరగొట్టాడు. ఐదో గేమ్‌‌‌‌లోనే నొవాక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేసి 3–2తో ఆధిక్యం సాధించాడు. తర్వాత ఇద్దరూ ఏస్‌‌‌‌లు, సర్వీస్‌‌‌‌ విన్నర్లతో  చెరో గేమ్​ నెగ్గుతూ వెళ్లారు.  పదో గేమ్‌‌‌‌లో పదునైన ఏస్‌‌‌‌తో కిరియోస్‌‌‌‌ సెట్‌‌‌‌నెగ్గాడు. వెంటనే పుంజుకున్న జొకోవిచ్‌‌‌‌ రెండో సెట్‌‌‌‌ మూడో  గేమ్‌‌‌‌లోనే బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ సాధించాడు. ఆపై, కిరియోస్​ తప్పిదాలు చేసేదాకా ఓపిక పట్టాడు. ఐదో గేమ్‌‌‌‌లో అనవసర తప్పిదంతో నిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కోల్పోవడంతో  ఈ సెట్‌‌‌‌ నొవాక్‌‌‌‌ సొంతమైంది. ఇక, మూడో సెట్‌‌‌‌లో ఇద్దరూ లాంగ్‌‌‌‌ ర్యాలీలతో నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. కీలకమైన తొమ్మిదో గేమ్‌‌‌‌లో 40–0తో నిలిచిన తర్వాత వరుస తప్పిదాలు చేసిన ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కోల్పోయాడు. తర్వాతి గేమ్‌‌‌‌లోనే సెట్‌‌‌‌ను గెలుచుకున్న జొకో ఓవరాల్‌‌‌‌గా 2–1 ఆధిక్యంతో ముందంజ వేశాడు. ఇక, మ్యాచ్‌‌‌‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన నాలుగో సెట్‌‌‌‌లో కిరియోస్‌‌‌‌ అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌ చేశాడు. అటు నొవాక్‌‌‌‌ కూడా తగ్గలేదు. ఇద్దరూ సర్వీస్‌‌‌‌లు నిలబెట్టుకుంటూ వెళ్లడంతో సెట్‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌కు దారి తీసింది. అక్కడ నిక్‌‌‌‌  డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌తో తొలి పాయింట్‌‌‌‌ నెగ్గిన జొకో ఓ ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ వ్యాలీ విన్నర్‌‌‌‌తో మరో పాయింట్‌‌‌‌ గెలిచాడు. ఆపై, కిరియోస్‌‌‌‌ వరుస తప్పిదాలతో 1–6తో వెనుకబడ్డాడు. ఈ దశలో తన సర్వీస్‌‌‌‌లో  ఫోర్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌, ఏస్‌‌‌‌తో 3–6తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాతి షాట్‌‌‌‌ నెట్‌‌‌‌కు తగలడంతో మ్యాచ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ సొంతమైంది.