న్యూఢిల్లీ: విమెన్స్ టీమిండియా స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణిపై డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలు గురి పెట్టాయి. గురువారం జరిగే వేలంలో వీళ్లకు భారీ మొత్తం దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఐదు జట్లు గరిష్టంగా 73 స్థానాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో 227 మంది వేలం బరిలో నిలిచారు.
ఇందులో 194 మంది ఇండియన్స్ కాగా, 83 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఇండియన్ ప్లేయర్లకు డిమాండ్ బాగా పెరిగింది. మెగా ఈవెంట్ విజయం తర్వాత యూపీ వారియర్స్ దీప్తి శర్మను వేలంలోకి రిలీజ్ చేసింది. దాంతో మిగతా ఫ్రాంచైజీలన్నీ ఆమెపై భారీ ఆశలు పెట్టుకున్నాయి.
హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, స్నేహ్ రాణాకు కూడా వేలంలో భారీగా స్పందన రానుంది. విదేశీ ప్లేయర్లలో మెగ్ లానింగ్, అలీసా హీలీ, సోఫీ ఎకెల్‌స్టోన్, సోఫీ డివైన్, అమెలియా కెర్ర్, లారా వోల్‌వర్ట్ వంటి స్టార్లపై అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఒకే ఒక్క ప్లేయర్‌ను అట్టి పెట్టుకున్న యూపీ వారియర్స్ వేలంలో గరిష్టంగా రూ. 14.5 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ అత్యల్పంగా రూ. 5.70 కోట్లు ఖర్చు చేయనున్నాయి. నలుగురు అసోసియేట్ ప్లేయర్లు తీర్థ సతీశ్, ఇషా ఓజా, తారా నోరిస్ (యూఎస్‌ఏ), తిపట్చా పుట్టవాంగ్ (థాయ్‌లాండ్) కూడా వేలం జాబితాలో ఉన్నారు. డబ్ల్యూపీఎల్ వచ్చే ఏడాది జనవరి 7న ప్రారంభం కానుంది.
