అదిగో పులి : గుజరాత్ లో 30 ఏళ్ల తర్వాత కనబడింది

అదిగో పులి : గుజరాత్ లో 30 ఏళ్ల తర్వాత కనబడింది

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రంలో 3 దశాబ్దాల తర్వాత ఓ పులి కనిపించింది. మహిసాగర్ జిల్లాలోని బొరియా గ్రామంలో రోడ్ క్రాస్ చేస్తున్న పులి…. అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. మహిసాగర్ జిల్లాలో  గత వారం స్థానిక ప్రభుత్వ స్కూల్ టీచర్ తాను పులి చూశానంటూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో.. ఫారెస్ట్ అధికారులు అక్కడి పరిసరాల్లో కొన్ని కెమెరాలను అమర్చారు. ఆ ప్రాంతంలో పులి సంచారం నిజమే అని… 7 నుంచి 8 ఏళ్ల వయసున్న పులి తిరుగుతోందని గుజరాత్ అటవీ శాఖ మంత్రి గణపతి సింగ్ వసారా ధ్రువీకరించారు.

3 దశాబ్దాల్లో తొలిసారి

గుజరాత్ లో గడిచిన 3 దశాబ్దాల్లో ఓ పులి కనిపించడం ఇదే తొలిసారి. ఈ రాష్ట్రంలో 1989లో చివరిసారిగా పులి సంచరించింది. ఆ తర్వాత ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ శాఖ అధికారులు లెక్కల్లో ఎక్కడా పులి ప్రస్తావన లేదు. ఇపుడు అహ్మదాబాద్ కు 120 కి.మీ.దూరంలోని బొరియా ప్రాంతంలో టైగర్ జనాలకు కనిపించింది.

ఈ పులి సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి అడవి మార్గంలో వచ్చి ఉండొచ్చని గుజరాత్ అటవీ మంత్రి చెప్పారు. తమ రాష్ట్రంలోని లెక్కల ప్రకారం.. ఓ పులి కనిపించకుండాపోయిందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రటించిందని కూడా అన్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని సంప్రదించి పులికి సంబంధించిన వివరాలు సేకరిస్తామని గుజరాత్ అటవీ శాఖ తెలిపింది. వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ తో మహిసాగర్ జిల్లాలో పులుల జాడ కోసం సర్వే చేయిస్తామని తెలిపారు.