ఎన్‌‌ఎస్‌‌ఈపై రోజుకు 17 కోట్ల సైబర్ దాడులు... కట్టుదిట్టమైన వ్యవస్థతో ఎదుర్కొంటున్న సంస్థ

ఎన్‌‌ఎస్‌‌ఈపై రోజుకు  17 కోట్ల సైబర్ దాడులు... కట్టుదిట్టమైన వ్యవస్థతో ఎదుర్కొంటున్న సంస్థ
  • తాజా సిమ్యులేషన్‌‌లో 40 కోట్ల దాడులు
  • 24 గంటలు పనిచేసే సైబర్ టీమ్‌‌
  • దాడులు తీవ్రమైతే  అందుబాటులోకి చెన్నైలోని  బ్యాకప్ సిస్టమ్‌‌

ముంబై: దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్‌‌ఎస్‌‌ఈ  రోజుకు సగటున 15 నుంచి 17 కోట్ల  సైబర్ దాడులను ఎదుర్కొంటోంది. ఇందుకోసం కట్టుదిట్టమైన వ్యవస్థను డెవలప్ చేసింది. రోజుకి  24 గంటలపాటు పనిచేసే సైబర్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.  ఇది  ఏడాది పొడవునా జాగ్రత్తగా పనిచేస్తోంది. ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనే డీడీఓఎస్ (డిస్ట్రిబ్యూటెడ్‌‌ డెనియల్ ఆఫ్ సర్వీస్‌‌) సిమ్యులేషన్ సమయంలో ఎన్‌‌ఎస్‌‌ఈ ఒక్కరోజులోనే 40 కోట్ల సైబర్ దాడులు ఎదుర్కొంది. 

అయితే టెక్నాలజీ, మానవ వనరులు, మెషిన్ల సాయంతో  ఎలాంటి నష్టం జరగకుండా విజయవంతంగా ఈ దాడులను ఎదుర్కోగలిగింది. ఎన్‌‌ఎస్‌‌ఈ సీనియర్ అధికారి మాట్లాడుతూ, “ప్రతి రోజు కోట్ల కొద్దీ సైబర్ దాడులు జరుగుతున్నా, మా టెక్నికల్ బృందాలు ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్‌‌లతో వాటిని నిరంతరం ఎదుర్కొంటున్నాయి. ట్విన్ సైబర్ డిఫెన్స్ సెంటర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి.  ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను రక్షించేందుకు అప్‌‌గ్రేడ్ చేసిన సాఫ్ట్‌‌వేర్‌‌‌‌నే  ఉపయోగిస్తున్నాం”అని వివరించారు.

భద్రతా చర్యలు

ఎన్‌‌ఎస్‌‌ఈ  ఇంటర్నల్‌‌గా వివిధ సైబర్ సెక్యూరిటీ చర్యలను తీసుకుంటోంది.  ఎన్‌‌ఎస్‌‌ఈ అకాడమీ ద్వారా సైబర్‌‌‌‌సెక్యూరిటీ ఫండమెంటల్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌‌ను  నిర్వహిస్తోంది. ట్రేడింగ్ మెంబర్లు రెగ్యులర్‌‌‌‌గా సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు చేయాలి.  వాటి ఫలితాలను సంస్థకి అందివ్వాలి. భద్రతా వ్యవస్థలో ఈమెయిల్స్, ఎక్స్‌‌టర్నల్‌‌  డేటా, పెన్ డ్రైవ్స్ వంటి అంశాలపై కఠిన నిబంధనలు ఉన్నాయి. 

డీడీఓఎస్‌‌ దాడులను గుర్తించిన వెంటనే అలర్ట్‌‌లు, పాప్-అప్స్ జనరేట్ అవుతాయి. కాగా, సైబర్‌‌‌‌ దాడులు సర్వర్‌‌ను ట్రాఫిక్‌‌తో ముంచి, నిజమైన వినియోగదారులకు సేవలు అందకుండా చేస్తాయి.  దీంతో స్టాక్ మార్కెట్ వంటి నిరంతర సేవలపై ఆధారపడే రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే ట్రేడింగ్ మెంబర్లు ఎంత మేర రెడీగా ఉన్నారనేది ఎన్‌‌ఎస్‌‌ఈ ఎప్పటికప్పుడు చెక్ చేస్తోంది.  వీఏపీటీ (వల్నరబిలిటీ అసెస్‌‌మెంట్ పెనెట్రేషన్‌‌ టెస్టింగ్) అన్ని ట్రేడింగ్ మెంబర్స్‌‌, సిబ్బందికి తప్పనిసరి చేసింది. 

దాడులు జరిగినా..బ్యాకప్‌తో రెడీ

 “సైబర్ దాడి జరిగితే మా వ్యవస్థలే కాకుండా, మాకు అనుసంధానమైనవి కూడా ప్రభావితమవుతాయి. గ్లోబల్‌‌గా కనెక్టివిటీ పెరుగుతోంది.  సిస్టమ్ క్లిష్టంగా ఉండడంతో తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయి సైబర్ దాడులు జరిగే ప్రమాదం పెరుగుతోంది. ఇది ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారుతోంది. వీటిని ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు  చెన్నై కేంద్రంగా సెల్ఫ్‌‌ యాక్టివేటెడ్‌‌  బ్యాకప్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 

ట్రేడింగ్ నుంచి బ్యాకప్ వరకు, ఈ వ్యవస్థ స్వయంగా సమస్యలను పరిష్కరించగలదు. అవసరమైనప్పుడు, చెన్నైలోని బ్యాకప్ సెటప్ యాక్టివేట్ అవుతుంది” అని ఎన్‌‌ఎస్‌‌ఈ అధికారి తెలిపారు. కాగా, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎన్‌‌ఎస్‌‌ఈ వెబ్‌‌సైట్‌‌ను విదేశీ వినియోగదారులకు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.