త్వరలో సెబీకి ఎన్‌‌ఎస్‌‌ఈ ఐపీఓ పేపర్లు!.. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో షేర్లు

త్వరలో సెబీకి ఎన్‌‌ఎస్‌‌ఈ ఐపీఓ పేపర్లు!..  ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో షేర్లు
  • రూ.5 లక్షల కోట్ల వాల్యుయేషన్‌‌ 

న్యూఢిల్లీ:  నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ) ఐపీఓ పనులు వేగవంతమయ్యాయి.   ఐపీఓ అనుమతి కోసం వచ్చే వారం (జూన్ 15 లేదా 16న) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను  సమర్పించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఎన్‌‌ఎస్‌‌ఈ బోర్డు ఐపీఓ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో రానుంది. అంటే ప్రస్తుత వాటాదారులు  తమ షేర్లను అమ్ముతారు తప్ప, కంపెనీ కొత్తగా షేర్లను జారీ చేయదు. కంపెనీకి ఫండ్స్ అందవు. ఎన్‌‌ఎస్‌‌ఈలో ఎల్‌‌ఐసీకి అత్యధికంగా 10.72శాతం ఉండగా,  ఎస్‌‌బీఐకి 7.5శాతం వాటా ఉంది. 

విదేశీ ఇన్వెస్టర్లలో టెమాసెక్ అనుబంధ సంస్థ అరాండా, కెనడా పెన్షన్ ఫండ్ లకు కూడా  వాటాలు ఉన్నాయి.  అన్‌‌లిస్టెడ్ మార్కెట్లో ఎన్‌‌ఎస్‌‌ఈ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లుగా ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనుంది. కాగా,  2016లోనే ఎన్‌‌ఎస్‌‌ఈ రూ. 10 వేల కోట్ల ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే 'కో-లొకేషన్' వివాదం కారణంగా సెబీ దీనిని నిలిపివేసింది.