పేపర్​ లీకులతో నిరుద్యోగులు ఆగం : కన్హయ్య కుమార్

పేపర్​ లీకులతో నిరుద్యోగులు ఆగం : కన్హయ్య కుమార్
  • కేసీఆర్​ది ఫెయిల్యూర్ సర్కార్: కన్హయ్య కుమార్

 
హైదరాబాద్, వెలుగు:
నిరుద్యోగి ప్రవళికది ఆత్మహత్య కాదని, సర్కార్​ హత్యేనని ఎన్​ఎస్​యూఐ నేషనల్​ ఇన్​చార్జి కన్హయ్య కుమార్​ ఆరోపించారు. బీఆర్​ఎస్​ సర్కార్​ ఎన్నో పేపర్లను లీక్​ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నదని పైర్​ అయ్యారు. హామీలు నెరవేర్చలేని వాళ్లే పేర్లు మార్చుకుంటారని, అలాగే టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా కేసీఆర్​ మార్చారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ సర్కార్​ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తెలంగాణ ఎలక్షన్​ క్వశ్చన్​ పేపర్​ పేరిట ప్రశ్నలను రిలీజ్​ చేశారు. 

ఎన్నికల ఫలితాలొచ్చే రోజే ఈ పేపర్​ ఆన్సర్లను రిలీజ్​ చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది కీలక పోరాటమన్నారు. ఓయూ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిందని గుర్తు చేశారు. పదేండ్లలో ఉద్యోగాల కల్పన సక్రమంగా జరగలేదన్నారు. హైదరాబాద్​ ఐటీ హబ్​ అని అంటున్నారని, మరి లక్షలాది ఉద్యోగాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. అన్ని హామీలనూ కేసీఆర్​ సర్కార్​ తుంగలోకి తొక్కిందన్నారు. 

మేనిఫెస్టోలో పెట్టినట్టు ఫిబ్రవరి ఒకటిన జాబ్​ క్యాలెండర్​ను రిలీజ్​చేస్తామన్నారు. ఏడాదిలో 2 లక్షల జాబ్స్​ భర్తీ చేస్తామన్నారు. కేజీ టు పీజీ అని హామీ ఇచ్చిన కేసీఆర్​.. విద్యను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. ప్రజలకు విద్య, ఉద్యోగాలు కావాలని, అది వారి హక్కు అని అన్నారు. కార్పొరేట్ల రుణాలు మాఫీ అవుతున్నప్పుడు రైతుల రుణాలు మాత్రం ఎందుకు మాఫీ కావని ఆయన ప్రశ్నించారు.