ఇసుక మాఫియా ఇష్టారాజ్యం

ఇసుక మాఫియా ఇష్టారాజ్యం

కరీంనగర్: ఇసుక క్వారీల యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అడ్డుకున్నారు. అనంతరం ఓవర్ లోడు వాహనాలను గుర్తించి వేబ్రిడ్జి వేయించారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ... ఒక్కో లారీలో సామర్థ్యాని కంటే ఐదు నుంచి ఎనిమిది టన్నులు అదనంగా నింపుతున్నారని, పది లారీలు వేబ్రిడ్జి వేయిస్తే ఐదు లారీలు అధిక లోడుతో ఉన్నాయన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుంచి లారీలు వెళ్ళొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ... వాటిని పాటించడంలేదన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన క్వారీ నిర్వాహకులు జమ్మికుంట మండలంలో ఎలా తవ్వకాలు జరుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఇంత స్వేచ్ఛగా రెచ్చిపోతుంటే... ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏ ఒక్క లారీని తిరగనివ్వబోమని హెచ్చరించారు.