- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
కల్లూరు, వెలుగు: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని పేర్కొన్నారు. కల్లూరు మండలంలోని దారుగా బంజార గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం టీడీపీ జిల్లా నాయకుడు జాస్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మంను నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం కల్లూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్కినేని కృష్ణ ఇంట్లో తేనేటి విందుకు హాజరయ్యారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీజీఐడీసీ చైర్మన్ మొవ్వ విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ టీడీ.జనార్ధన్, కల్లూరు ఏఎంసీ చైర్పర్సన్ భాగం నీరజాదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు పోట్రు శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.
