నిందితులకు బెయిల్..మహిళా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ పై అసభ్య కథనాల కేసు

నిందితులకు బెయిల్..మహిళా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ పై అసభ్య కథనాల కేసు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహిళా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌పై అసభ్య కథనాల కేసులో నిందితులైన ఎన్టీవీ ఇన్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంతు రమేశ్‌‌‌‌‌‌‌‌, సీనియర్ రిపోర్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాసరి సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ షరతులతో కూడిన బెయిల్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, పాస్‌‌‌‌‌‌‌‌పోర్టులను సరెండర్ చేయాలని జడ్జి ఆదేశించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ విడిచి వెళ్లొద్దని షరతు విధించారు. జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ కేసులో దొంతు రమేశ్, సుధీర్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సిట్.. బుధవారం   విచారించింది. అదే రోజు రాత్రి 11:30 గంటల తర్వాత మణికొండలోని నాంపల్లి 14వ అడిషనల్‌‌‌‌‌‌‌‌ చీఫ్ మెట్రోపాలిటన్‌‌‌‌‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ నివాసంలో హాజరుపరిచింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున వీళ్లిద్దరికీ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌ విధించాలని కోరింది. ఈ సందర్భంగా నిందితుల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఏడేండ్ల లోపు శిక్ష గల బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలిపారు. 

ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంలో ఎవరి పేరు గానీ, వ్యక్తిగత వివరాలను గానీ వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.  ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ.. ఎన్టీవీ కథనంలో పేర్లు వెల్లడించనప్పటికీ, వాళ్లు ఎవరో తెలిసే విధంగా వార్తలు ప్రసారం చేశారని తెలిపారు. మహిళా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పూచీకత్తు సమర్పించేందుకు శనివారం వరకు గడువు ఇచ్చారు. దొంతు రమేశ్‌‌‌‌‌‌‌‌, సుధీర్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు విడిచిపెట్టారు.