40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాలు తగ్గుతున్నయ్.!

40 నుంచి 50 ఎంపీటీసీ స్థానాలు తగ్గుతున్నయ్.!
  • మున్సిపాలిటీల్లో 71 జీపీలు విలీనం
  • 40 నుంచి 50 స్థానాలు తగ్గే ఛాన్స్​
  • ‘స్థానిక’ ఎన్నికల నుంచి మేడ్చల్​ ఔట్.. 
  • ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో గతం కంటే ఈ సారి ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది.  ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా..  570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. విలీన పంచాయతీలను లిస్ట్​ నుంచి తొలగిస్తే దాదాపు 40 నుంచి 50 వరకు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశంఉన్నట్లు తెలిసింది.  కొన్నిచోట్ల మండలాలు కూడా కలవడంతో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు సైతం ఒకటి, రెండు తగ్గే  అవకాశాలున్నాయని పీఆర్​ అధికారులు పేర్కొంటున్నారు. 

 కాగా, పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్​ సృజన ఈ నెల 7న ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్​కు ఉత్తర్వులు జారీ చేశారు. 8న ముసాయిదా ప్రచురణ, 8, 9 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 10, 11 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 12న తుది జాబితాను ప్రకటించాలని కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల పూర్తి లెక్క తేలనున్నది. 

31 జడ్పీ చైర్మన్​ స్థానాలకే ఎన్నికలు

శివారు కార్పొరేషన్లలో మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లా విలీనమైంది. దీంతో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ నుంచి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఔట్​అయ్యింది.   రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్‌‌‌‌లు ఉండగా..  ప్రస్తుతం 31 జడ్పీ చైర్మన్​లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.  గతంలో 539 మండల పరిషత్‌‌‌‌లు ఉండగా.. ఇప్పుడు వాటిసంఖ్య 570 కు చేరింది.  570 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 33 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, ఆ తర్వాత నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 26, కామారెడ్డిలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.  అతితక్కువగా ములుగు జిల్లాలో 10 జడ్పీటీసీ స్థానాలున్నాయి.  2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా..  ప్రస్తుతం వాటిసంఖ్య 12,777కు చేరింది.