హైదరాబాద్​ జిల్లాలో ఈసారైనా ప్రభుత్వ బడులు నిండేనా?

హైదరాబాద్​ జిల్లాలో ఈసారైనా ప్రభుత్వ బడులు నిండేనా?
  • హైదరాబాద్​ జిల్లాలో ఏటా తగ్గిపోతున్న స్టూడెంట్ల సంఖ్య
  • గతేడాది హుమాయున్ నగర్ స్కూల్​లో చదువుకుంది కేవలం 29 మందే
  • పురాణాపూల్ లో 40, షాహ్ గంజ్ లో 44 మంది స్టూడెంట్లు
  • స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం చర్యలు
  • ‘అమ్మ ఆదర్శ పాఠశాల’తో బడుల్లో మౌలిక వసతుల కల్పన
  • ‘బడిబాట’ తో స్టూడెంట్లు, పేరెంట్స్​కు అవగాహన 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదువుకునే స్టూడెంట్ల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. కొన్ని స్కూళ్లలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు జరుగుతుండగా, మిగిలిన అన్ని స్కూళ్లలో స్టూడెంట్ల స్ట్రెంత్​తగ్గిపోతోంది. అదే ఏరియాల్లోని ప్రైవేట్​స్కూళ్లు స్టూడెంట్లతో నిండిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 691 గవర్నమెంట్​స్కూళ్లు ఉన్నాయి. వీటిలోని మెజారిటీ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. హుమాయున్ నగర్, పురాణాపూల్, షాహ్​గంజ్ హైస్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య 50కు మించట్లేదు.

కనీస వసతులు లేకపోవడం, టీచర్ల కొరతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్​ప్రభుత్వం ప్రైవేట్​స్కూళ్లకు దీటుగా సర్కారీ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. స్కూళ్లలో కనీస వసతులు కల్పిస్తోంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ద్వారా స్కూళ్లలోని సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తోంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ అందిస్తున్నామని, ఉచితంగా యూనిఫాం, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ ఇస్తున్నామని, క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని బస్తీలు, కాలనీల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. 

టెన్త్​క్లాస్ ఖాళీ

గతేడాది ఆసిఫ్ నగర్ పరిధిలోని హుమాయున్ నగర్ హైస్కూల్​లో మొత్తం 29 మంది స్టూడెంట్లు మాత్రమే చదువుకున్నారు. బహదూర్ పురా పరిధి పురాణాపూల్ హైస్కూల్​లో 40 మంది, షాహ్ గంజ్ హైస్కూల్​లో 44 మంది ఉన్నారు. వీటితోపాటు న్యూనల్లగుట్ట, చెత్తబజార్, అఫ్జల్​గంజ్ తదితర స్కూళ్లలో అతి తక్కువ ఎన్​రోల్​మెంట్ జరిగింది. ఆయా తరగతుల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేరు. గతేడాది హుమాయున్ నగర్, షాహ్​గంజ్ హైస్కూళ్లలో పదో తరగతి స్టూడెంట్లు ఒక్కరు కూడా లేకపోవడం ప్రభుత్వ బడుల పరిస్థితికి అద్దం పడుతోంది. సింగిల్​స్టూడెంట్​ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయి. మరికొన్ని కొన్ని స్కూళ్లలో అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు లేరు.

వెక్కిరిస్తున్న టీచర్ల కొరత

జిల్లాలోని 691 ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది మొత్తం 1,05,281 మంది స్టూడెంట్లు ఉండగా, టీచర్లు 6,200 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అనుకున్న స్థాయిలో టీచింగ్ జరగట్లేదనే విమర్శలు ఉన్నాయి. బంజారాహిల్స్ గవర్నమెంట్ స్కూల్​లో గతి ఎన్జీఓకు చెందిన వలంటీర్లు, బోరబండ గవర్నమెంట్ హైస్కూల్​నాట్కోకు చెందిన వలంటీర్లు, ఫిల్మ్ నగర్ హై స్కూల్ లో రోటరీ క్లబ్​కు చెందిన వలంటీర్లు, రాజ్ భవన్ స్కూల్ లో సైంట్ కు చెందిన వలంటీర్లు టీచింగ్​చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రాన్స్​ఫర్లలోనైనా సరిపడా టీచర్లు నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చాలాచోట్ల స్కావెంజర్ల కొరత ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించి క్లీన్ చేయిస్తున్నాయి. ప్రభుత్వ వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

10 స్కూళ్లలో 500కు మించి.. 

691 ప్రభుత్వ స్కూళ్లలో కేవలం పది స్కూళ్లలో మాత్రమే స్టూడెంట్ల సంఖ్య 500కు మించుతోంది. నాంపల్లి హైస్కూల్​లో 1,512 మంది, యూసఫ్​గూడలో 1,060, ఫిల్మ్ నగర్ లో 920, కుల్సుంపురా, కిషన్ బాగ్, అంబర్ పేట సీపీఎల్, రాజ్ భవన్, బంజారాహిల్స్, బార్కస్, మడ్ ఫోర్ట్ హైస్కూళ్లలో 500 మందికి పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. అన్ని స్కూళ్లకు భిన్నంగా రాజ్ భవన్ స్కూల్ ఉంది. ఇక్కడ అడ్మిషన్ల కోసం డైలీ వందల మంది వచ్చి వెళ్తున్నారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్​భవన్​స్కూల్​లో 650 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇక్కడ విశాలమైన క్లాస్​రూమ్స్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ ఉన్నాయి. ఇక్కడి స్టూడెంట్లకు టెన్త్​లో మంచి ఫలితాలు వస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.    

నామ మాత్రంగా బడిబాట 

ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్కూళ్లలో టాయిలెట్స్, వాటర్ ట్యాంకులు, టైల్స్, పెయింటింగ్, గ్రిల్స్ వసతులు కల్పిస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్, డిజిటల్ క్లాసులు, ఉచితంగా యూనిఫాం, బుక్స్, ఉదయం, మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తోంది. ట్రాన్స్​పోర్ట్​చార్జీలు చెల్లిస్తోంది. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల ప్రత్యేకతలను టీచర్లు వివరిస్తున్నారు. టెన్త్​లో టాపర్ల ఫొటోలు, మార్కులతో పోస్టర్లు వేయించి ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని స్కూళ్లలో నామ మాత్రంగా బడిబాట జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.  వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. మొక్కుబడిగా బడిబాట నిర్వహించడం ఏమిటని జనం మండిపడుతున్నారు.