రాష్ట్రంలో నంబర్ ప్లేట్స్ ఇస్తలేరు..4 నెలలుగా ఇదే పరిస్థితి

రాష్ట్రంలో నంబర్ ప్లేట్స్ ఇస్తలేరు..4 నెలలుగా ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త బండ్లు కొన్నోళ్లకు షోరూం డీలర్లు నంబర్ ప్లేట్స్ ఇస్తలేరు. కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రింటింగ్​ ఆగిందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష నంబర్ ప్లేట్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పట్టుకున్నప్పుడు ఫైన్ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో నంబర్ ప్లేట్స్ ఆర్టీఏ కార్యాలయాల్లో అందించేవారు. గతేడాది అక్టోబర్ నుంచి బండి కొన్న షోరూంలలోనే నంబర్ ప్లేట్ తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి నుంచి నంబర్ ప్లేట్స్ జారీ ఆలస్యం అయ్యింది. తర్వాత మార్చిలో కరోనా కారణంగా లాక్​డౌన్​విధించడంతో కంపెనీల్లో ప్రింటింగ్​ ఆగిపోవడంతో నంబర్​ ప్లేట్స్​ఇవ్వలేకపోతున్నామని డీలర్లు చెబుతున్నారు. నంబర్​ ప్లేట్స్ రాగానే మెసేజ్​ చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఆర్టీఏ ఆఫీస్​లో సుమారు 500  వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయని అన్నారు. ఇప్పటి దాకా లక్ష వరకు నంబర్ ప్లేట్స్ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.

ఫైన్ వేస్తున్రు..

గతంలో బండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లోనే నంబర్ ప్లేట్ వచ్చేది. ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ అయ్యాక 4 నెలలు గడుస్తున్నా రావడంలేదు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నప్పుడు నో నంబర్ ప్లేట్ కింద ఫైన్ వేస్తున్నారు. టూ వీలర్ కు అయితే 500, ఫోర్ వీలర్ కు అయితే 1000 ఫైన్ వేస్తున్నారు. వాస్తవానికి టెంపరరీ నంబర్ ప్లేట్ వ్యాలిడిటీ ఒక నెల లేదా 100 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.

ఎక్స్ ట్రా తీసుకుంటున్రు..?

షోరూంలలో నంబర్ ప్లేట్ ఫిట్ చేయడానికి బైక్ అయితే రూ.50 నుంచి రూ.100, కారుకు రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా తీసుకుంటున్నారని వాహనదారులు వాపోతున్నారు. బండి కొనేటప్పుడే ఫిట్టింగ్, నంబర్​ ప్లేట్​ ఛార్జీలకు టూవీలర్​కు రూ.250, కారుకు రూ.550 చెల్లిస్తారు. అయినా కూడా నంబర్ ప్లేట్ ఫిట్ చేసేటప్పుడు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.