నీట్, ఎంసెట్ రాయకపోయినా నర్సింగ్ సీట్లు: ఉత్తర్వులిచ్చిన సర్కార్

నీట్, ఎంసెట్ రాయకపోయినా నర్సింగ్ సీట్లు: ఉత్తర్వులిచ్చిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: నీట్, ఎంసెట్ రాయని విద్యార్థులకు కూడా బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్లు ఇచ్చేలా నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ మేరకు శుక్రవారం హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. గత అకాడమిక్ తరహాలోనే, ఈసారి కూడా ఇంటర్​లో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు భర్తీ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఏడాది నుంచి నీట్‌ లేదా ఎంసెట్‌ రాసి, అందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేయాలని కేంద్రం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారమే ఈ ఏడాది రాష్ట్రంలో నర్సింగ్ సీట్లను భర్తీచేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి నర్సింగ్ కాలేజీలు ఉండడంతో, చాలా కాలేజీల్లో సీట్లు నిండలేదు. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. దీంతో నిబంధనల్లో సడలింపులు ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.