బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీని గెలిపించండి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీని గెలిపించండి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు:  తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్ అన్నారు.  ఆదివారం ఉప్పల్ కొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి గార్డెన్‌‌లో జరిగిన బీసీల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ప్రభాకర్ మాట్లాడారు.‌‌  కార్యక్రమానికి తూళ్ల వీరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ బీసీలను ఉద్దేశించి మాట్లాడారు.  తెలంగాణలో బహుజనుల ఆత్మగౌరవం నిలబడాలన్నా, ఒక బీసీ  ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలన్నా బీజేపీని గెలిపించాలని కోరారు.  

తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తామని తెలంగాణ ప్రజలను కేసిఆర్ మోసం చేశాడని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని ప్రకటించి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఉప్పల్ లో  37 సామాజిక భవనాల నిర్మాణం చేయించిన ఘనత తనదేనన్నారు. రామంతాపూర్‌‌‌‌ను సుందరంగా తీర్చిదిద్దానని మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు.  

ఆదివారం రామంతపూర్ డివిజన్ లో ఎస్ ఎం ఆర్ అపార్ట్మెంట్స్ లో ప్రచారం నిర్వహించారు.  తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.