6 వికెట్లతో చెలరేగిన మెకాయ్..భారత్ ఓటమి

6 వికెట్లతో చెలరేగిన మెకాయ్..భారత్ ఓటమి

సెయింట్‌‌కిట్స్‌‌: వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలైంది. విండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 139 రన్స్ టార్గెట్ ను మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో కింగ్(68), థామస్(31), నికోలస్ పూరన్(14), రన్స్ చేశారు. దీంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. భారత బౌలర్లలో అర్షదీప్, జడేజ, అశ్విన్, హార్దిక్ పాండ్యా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 138 రన్స్ కే కుప్పకూలింది. టీమిండియాకు మంచి ప్రారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌ ఫస్ట్ బాల్‌‌కే కెప్టెన్‌‌ రోహిత్‌‌ (0)ను మెకాయ్‌‌ గోల్డెన్‌‌ డకౌట్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్‌‌ (11)ను కూడా పెవిలియన్‌‌ చేర్చాడు. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (10) కూడా ఫెయిలవగా.. రిషబ్‌‌ పంత్‌‌ (24), హార్దిక్‌‌ (31), జడేజ(27) రాణించారు.  

భారత్‌ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. 6 వికెట్లు తీసిన మెకాయ్.. టీమిండియా బిగ్ టార్గెట్ కు బ్రేకులేశాడు. 


లగేజీ రాక మ్యాచ్‌‌ మూడు గంటలు లేటు

వర్షం, వాతావరణం, ఫ్లడ్​ లైట్స్‌‌ సమస్య కారణంగా క్రికెట్‌‌ మ్యాచ్‌‌లు ఆలస్యం కావడం సహజం. కానీ, సోమవారం టీమిండియా–వెస్టిండీస్‌‌ మధ్య రెండో టీ20 అనూహ్య కారణంతో ఆలస్యమైంది. స్టేడియానికి టీమ్‌‌ లగేజీ రావడంతో జాప్యం కావడంతో ఈ మ్యాచ్‌‌ ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. ఇరు జట్లూ తొలి టీ20ని ట్రినిడాడ్‌‌లో ఆడాయి. అక్కడి నుంచి  రెండో మ్యాచ్‌‌ కోసం ఆటగాళ్లు సెయింట్‌‌ కిట్స్‌‌ చేరుకోగా.. వాళ్ల లగేజీ సకాలంలో  చేరలేదు. దాంతో, మ్యాచ్‌‌ రెండు గంటలు లేటుగా మొదలవుతుందని విండీస్‌‌ బోర్డు ప్రకటించింది. తర్వాత మరో గంట లేటైంది. ఇండియా టైమ్‌‌ ప్రకారం రాత్రి 8 గంటలకు షురూ అవ్వాల్సిన ఈ పోరు 11 గంటలకు స్టార్ట్‌‌ చేశారు.