హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ వార్డుల విభజన గందరగోళంగా ఉందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల లీడర్ల నుంచి భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అభ్యంతరం తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందన్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే విభజన చేశారన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఏ పారామీటర్ ఆధారంగా వార్డుల విభజన చేశారో తెలియడం లేదన్నారు. ఈనెల17లోపు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. వార్డుల పునర్విభజన చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని కోరామని, హద్దులు తెలియకుండా అధికారులు ఫిక్స్ చేశారన్నారు.
ఇష్టానుసారంగా చేసి..
బీఆర్ఎస్సనత్నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మల్లారెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణి.. కమిషనర్‌ను కలిసి మాట్లాడారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ను ఫీల్డ్ లో తిరగకుండా ఆఫీస్ లో కూర్చొని ఇష్టానుసారంగా చేశారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో మేడ్చల్ మొత్తం రూరల్ గా ఉందని, 400 మంది కౌన్సిలర్లతో ఉన్న పాలనను 16 మంది కార్పొరేటర్లకు కుదించారన్నారు. దీంతో రాజకీయ నిరుద్యోగం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీలో పట్టులేనందుకే బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని ఈ ప్లాన్ చేశారని ఆరోపించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను పున:పరిశీలించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. కొన్ని డివిజన్ల పేరు మార్పును వ్యతిరేకించారు. డీలిమిటేషన్లో తప్పిదాలను సరిచేయాలని బన్సీలాల్‌పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, తదితర లీడర్లు సోమవారం నార్త్ జోన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (డీసీ) డాకు నాయక్ ను కలిశారు. కొన్ని బస్తీలు, కాలనీలు రెండు మూడు డివిజన్లలో కలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని అభ్యంతరాలు తెలియజేశారు.
గందరగోళంగా విభజన : బీజేపీ నేతలు
ఒక వార్డులో తక్కువ జనాభా.. మరో వార్డులో ఎక్కువ జనాభా ఉండేలా గందరగోళంగా విభజన జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. విలీనమైన జోన్లలో కాకుండా తమకు వేరే జోన్లలో కలపాలని కమిషనర్ ని కోరారు. తుర్కయంజాల్, బడంగ్ పేట్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నామన్నారు. బడంగ్ పేట, తుర్క యాంజల్ ను ఎల్బీ నగర్ జోన్ లో కలపాలని కోరారు. లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలన్నారు. డీలిమిటేషన్ పై ఇప్పటికే 2 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయని, వీటిని బట్టి చూస్తే అధికారులు ఎలా విభజించారో అర్థమవుతుందన్నారు. ఓల్డ్ సిటీ లో తక్కువ జనాభాకు ఎక్కువ డివిజన్లు చేశారని, నగర శివార్లలో ఎక్కువ జనాభా ఉంటే తక్కువ డివిజన్లు చేశారని ఆరోపించారు. శంషాబాద్ ను నాలుగు వార్డులుగా విభజించి సర్కిల్ ను రాజేంద్రనగర్ జోన్ లో చేర్చాలని సోమవారం శంషాబాద్ సర్కిల్ బీజేపీ కార్యవర్గ సభ్యులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
నేడు కౌన్సిల్ మీటింగ్
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై మంగళవారం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం జరగనుంది. కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల అభిప్రాయాలు తెలుసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలతో పాటు కౌన్సిల్ మీటింగ్ లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల సూచనలు , సలహాలు పరిగణన లోకి తీసుకోనున్నారు. ఉదయం 10:30 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది.
