Obulapuram Mining Case: చంచల్ గూడ జైలు లోపటికి గాలి జనార్దన్ రెడ్డి.. ఆయన ఆస్తులను ఏం చేస్తారంటే..

Obulapuram Mining Case: చంచల్ గూడ జైలు లోపటికి గాలి జనార్దన్ రెడ్డి.. ఆయన ఆస్తులను ఏం చేస్తారంటే..

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్ధన్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆర్డర్ కాపీ కోసం ఇప్పటి వరకు నలుగురు ముద్దాయిలను కోర్ట్లోనే ఉంచారు. ఆర్డర్ కాపీ రావడంతో సీబీఐ కోర్టు నుంచి నేరుగా చంచలగూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించారు.

సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తామని గాలి జనార్ధన్ రెడ్డి తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మంగళవారం నాడు తుది తీర్పు వెల్లడించిన సీబీఐ కోర్టు గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీ.డీ. రాజ్ గోపాల్ రెడ్డి, గాలి పీఏ అలీ ఖాన్ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఓబులాపురం మైనింగ్ కేసులో A1 శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ కాగా.. A7 అలీఖాన్. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన అనేక ఆస్తులను సీబీఐ ఇప్పటికే జప్తు చేసింది. ఆ ఆస్తులను ప్రభుత్వం జమ చేసుకుంటుంది. గాలి జనార్ధన్ రెడ్డి పేరు మీద, ఆయన భార్య అరుణ పేరు మీద 124 ఆస్తులు ఉండగా వాటిల్లో 100కు పైగా సీబీఐ జప్తు చేయడం గమనార్హం. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం పోటీ చేసింది.

మైనింగ్ వ్యాపారంలోనే కోట్లు వెనకేసిన గాలి జనార్ధన్‌ రెడ్డి ఆయన భార్య లక్ష్మీ అరుణ పేరిట 250 కోట్ల రూపాయల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ దగ్గర 84 కిలోల బంగారం, వజ్రాలు.. 437 కిలోల వెండి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం స్పష్టం చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి భార్యకు ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్లో చెప్పుకొచ్చారు.

జనార్ధన్ రెడ్డి భార్య దగ్గర ఉన్న బంగారం, వజ్రాల విలువ రూ.24.4 కోట్లని అఫిడవిట్లో తెలిపారు. ఏపీలో, తెలంగాణలో గాలి జనార్ధన్ రెడ్డి భార్య పేరిట 93 అగ్రికల్చర్ ప్లాట్స్ ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో మరోసారి ఆయన ఆస్తిపాస్తుల ప్రస్తావన అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.