- డిమాండ్ల సాధనకు జనవరి 11న హనుమకొండలో సింహగర్జన
- ఓసీ జేఏసీ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి
బషీర్బాగ్, వెలుగు: పేద ఓసీల హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తామని ఓసీ జేఏసీ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి చెప్పారు. ఓసీల డిమాండ్ల సాధనకు జనవరి 11న చలో వరంగల్ పేరుతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు. ఓసీ జేఏసీ ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం ఓసీల హక్కుల కోసమే పోరాడుతుందని స్పష్టం చేశారు.
అగ్రకుల పేదల కోసం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓసీ కమిషన్ ఏర్పాటు చేసి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి షరతులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచి, ఓసీ ఈడబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, కోశాధికారి నడిపల్లి వెంకటేశ్వర్లు, బుట్టెంగారి మాధవరెడ్డి, బోయినపల్లి పాపారావు, మోహన్ రావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
