అరేయ్ అసలు ఎవర్రా మీరంతా..! ఎన్నికల్లో ఓడిపోవాలని అభ్యర్థి గుర్తుకు క్షుద్రపూజలు

అరేయ్ అసలు ఎవర్రా మీరంతా..! ఎన్నికల్లో ఓడిపోవాలని అభ్యర్థి గుర్తుకు క్షుద్రపూజలు

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓ ఓటర్ మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లు నమిలి మింగగా తాజాగా అంతకుమించిన మరో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోవాలని ఏకంగా అభ్యర్థి గుర్తుకు క్షుద్రపూజలు చేశారు. మైండ్ బ్లాంక్ అయిపోయే ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో జరిగింది. 

వివరాల ప్రకారం.. గోళ్లపాడు గ్రామానికి చెందిన రవి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‎గా పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో రవి అంటే గిట్టని వ్యక్తులు అతడు ఎలాగైనా ఎన్నికల్లో ఓడిపోవాలని దారుణానికి ఒడిగట్టారు. బ్యాలెట్ పేపర్‎లో రవికి కేటాయించిన కత్తెర గుర్తుకు క్షుద్రపూజలు చేశారు. ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోనే క్షుద్రపూజలు చేయడం గ్రామంలో సంచలనంగా మారింది. ఈ విషయం క్షణాల్లోనూ ఊరంతా వ్యాపించింది. ఇది విని కొందరు భయబ్రాంతులకు గురి కాగా.. మరికొందరు మండిపడుతున్నారు. 

ఎన్నికల్లో ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కొవాలి కానీ.. ఇలాంటి చిల్లర పనులు ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్‎గా మారింది. అభ్యర్థి ఓడిపోవాలని అతడి గుర్తుకు క్షుద్ర పూజలు చేయడం చూసి అవాక్క్ అవుతున్నారు నెటిజన్లు. అరేయ్ అసలు ఎవర్రా మీరంతా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఘటన తర్వాత గోళ్లపాడు గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.