డాక్టర్ ముసుగులో క్షుద్ర పూజలు

డాక్టర్ ముసుగులో క్షుద్ర పూజలు

హనుమకొండ, వెలుగు: డాక్టర్​ ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్​టాస్క్​ఫోర్స్, హనుమకొండ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల అరెస్ట్​కు సంబంధించిన వివరాలను వరంగల్ ​సెంట్రల్ ​జోన్​ డీసీపీ ఎంఏ.బారి హనుమకొండ పీఎస్​లో సోమవారం వెల్లడించారు. హనుమకొండ నయీంనగర్​కు చెందిన సయ్యద్ ​ఖాదిర్​అహ్మద్ ఇంటర్​వరకు చదివాడు. కరీంనగర్​లోని ఓ డాక్టర్​ వద్ద అసిస్టెంట్ గా పని చేసినపుడు అల్లోపతి ​ట్రీట్​మెంట్​పై అవగాహన పెంచుకున్నాడు.  తండ్రి కరీముల్ల ఖాద్రీ గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టే పని చేయగా.. అది కూడా నేర్చుకున్నాడు. అనంతరం నయీంనగర్​లోని ఇంట్లో అన్న కొడుకు సయ్యద్​షబ్బీర్​అహ్మద్​తో కలిసి ఆసుపత్రి ప్రారంభించాడు.

పర్మిషన్​ లేకుండా అందులోనే ల్యాబ్​ కూడా నిర్వహిస్తూ తమ వద్దకు వచ్చే రోగులకు  తోచిన టెస్టులన్నీ చేసేవారు. గిట్టనివారు చేతబడులు చేశారని, దెయ్యం పట్టిందని జనాలను నమ్మించి, పూజలు చేసి సమస్యను పరిష్కరిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేసేవారు.

ఇలా 35 ఏండ్లుగా ఖాదిర్​డాక్టర్​గా కొనసాగుతుండగా.. షబ్బీర్​ హైదరాబాద్​ఉప్పల్​లో ఉంటూ అక్కడా ఇదే తీరుగా దందా స్టార్ట్ చేశాడు. అర్హత లేకుండా వైద్యం చేయడమే కాకుండా.. మూఢ నమ్మకాలతో జనాలను మోసం చేస్తున్నట్లుగా వరంగల్ టాస్క్​ఫోర్స్, హనుమకొండ పోలీసులకు సమాచారం అందడంతో నయీంనగర్​లోని ఖాదిర్​ఇంటిపై జిల్లా వైద్యాధికారులు, పోలీసులు సోమవారం ఉదయం రైడ్​ చేశారు. ఖాదిర్​తోపాటు హైదరాబాద్​లో రైడ్​ చేసి షబ్బీర్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. క్షుద్రపూజలతో పాటు నకిలీ వైద్యంలో వీరికి సహకరించిన నిందితుల బంధువులు యాకుబ్​ బాబా, అతని భార్య సమ్రీన్​, మరో బంధువు ఎండీ ఇమ్రాన్​ పరారీలో ఉన్నారు.