బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ ఎటాక్.. చనిపోతూ 48మందిని సేవ్ చేసిండు

బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ ఎటాక్.. చనిపోతూ 48మందిని సేవ్ చేసిండు

భువనేశ్వర్‌కు రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తున్న నలభై ఎనిమిది మంది ప్రయాణికులను డ్రైవర్.. తన ప్రాణాలకు తెగించి కాపాడాడు.డ్రైవర్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైనా.. చాకచక్యంగా ప్రవర్తించి, అతను తుది శ్వాస విడిచే ముందు.. బస్సును గోడకు ఢీకొట్టి నిలిపివేశాడని పోలీసులు తెలిపారు. కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపంలో అక్టోబర్ 27న రాత్రి ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు.

సనా ప్రధాన్‌గా గుర్తించిన బస్సు డ్రైవర్‌కు డ్రైవింగ్ చేస్తుండగా ఛాతీ నొప్పి రావడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. "అతను ముందుకు నడపలేడని గ్రహించాడు. కావున అతను వాహనాన్ని రోడ్డు పక్కన ఉన్న గోడకు ఢీకొట్టాడు. ఆ తర్వాత బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణీకుల ప్రాణాలను రక్షించగలిగాడు" అని టికాబలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్స్పెక్టర్ కళ్యాణమయి సేంద చెప్పారు.

'మా లక్ష్మి' అనే ప్రైవేట్ బస్సు సాధారణంగా కంధమాల్‌లోని సారన్‌ఘర్ నుంచి జి ఉదయగిరి మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ప్రతి రాత్రి తిరుగుతుందని కళ్యాణమయి చెప్పారు. ఈ సంఘటన తర్వాత, అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు గుండె ఆగిపోవడంతో అతను చనిపోయినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మరో డ్రైవర్‌తో కలిసి బస్సు తన గమ్యస్థానానికి ప్రయాణికులతో బయలుదేరిందని వారు తెలిపారు. ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వారు తెలిపారు. దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు సేందా చెప్పారు.