డబ్బుల్లేక భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెళ్లిన భర్త

డబ్బుల్లేక భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెళ్లిన భర్త

భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న 33ఏళ్ల గిరిజన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదుకున్నారు. తన భార్య డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో.. చేసేదేం లేక ఆ వ్యక్తి, తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని హైవేపై నడుచుకుంటూ వెళ్లాడు. మరో వాహనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అతని వద్ద డబ్బు లేదని అధికారులు తెలిపారు. రోడ్డుపై వెళుతున్న ఆ వ్యక్తిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసుల సహకారంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన ఈడే సాములు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య ఈడె గురుని విశాఖపట్నంలోని సంగివలసలోని ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్సకు స్పందించడం మానేసిన ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

ఆసుపత్రికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి వెళ్లడానికి అతను ఆటో రిక్షాను అద్దెకు తీసుకున్నాడు. కాని అతని భార్య విజయనగరం సమీపంలో మార్గమధ్యంలోనే మరణించింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్‌కు ₹ 2,000 చెల్లించి ఆ వ్యక్తి.. అంతకుమించి ముందుకు వెళ్లడానికి డబ్బు లేకపోవడంతో ఈడే సాములు తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని చాలా కిలోమీటర్లు నడిచాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఒడిశాలోని సొరాడ గ్రామానికి తీసుకెళ్లడానికి పోలీసులు రూ.10వేలు ఖర్చు చేసి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.