
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 238కి చేరగా... మరో 1000 మందికి పైగా గాయాలయ్యాయి. రైల్వే అధికారులు, ఆర్మీ సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర వేడుకలను రద్దు చేసిన ఒడిశా సర్కార్ ..ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.
మోడీ హైలెవల్ మీటింగ్
రైలు ప్రమాద ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.
జూ.ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ సమీక్ష
ప్రమాద ఘటనపై తమిళ నాడు సీఎం సమీక్ష నిర్వహించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు. తమిళనాడు తరపును సహాయక చర్యలకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశాలకు ఉదయనిధి స్టాలిన్ మంత్రుల బృందం వెళ్లిందని చెప్పారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన దురదృష్టకరమని ఏపీ సీఎం జగన్అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి అధికారుల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశా రైలు ప్రమాదం జరిగిన స్థలం దగ్గరకు సీఎం నవీన్ పట్నాయక్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.
238కి చేరిన మృతులు.. రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రికి క్యూ
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 238కు చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఎంతో మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా బోగీల కింద చిక్కుకున్న చాలా మంది బాధితులు సాయం కోసం ఆర్జిస్తున్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఓడీఆర్ఎఫ్, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్ ,లోకల్ పోలీసులు,వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరందరికీ రక్తం అవసరం ఉందని తెలిసి చాలా మంది రక్తదానం చేసేందుకు భద్రక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కట్టారు. క్యూలో నిలబడి రక్తం దానం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటనపై నేపాల్ ప్రధాని సంతాపం
ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది కొద్దీ ప్రాణాలు కోల్పోవడం పట్ల నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సంతాపం తెలిపారు. "ఈరోజు భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దర్యాప్తుకు హైలెవల్ కమిటీ
- ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దర్యాప్తుకు హైలెవర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
కొరమండల్ ఎక్స్ ప్రెస్ లో 120 మంది ఏపీ వాసులు
కొరమండల్ ఎక్స్ ప్రెస్ లో విజయవాడకు చెందిన 120 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా షాలిమార్ నుంచి విజయవాడకు వస్తున్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయవాడ హెల్ప్ లైన్ల కోసం 086667055, 2576924 రైల్వే అధికారులు ప్రకటించారు.
ఒడిశా వేడుకలు రద్దు.. ఇవాళ సంతాపం దినం ప్రకటించిన సర్కార్
రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(జూన్ 3) రాష్ట్రంలో సంతాప దినంగా పాటించనుంది. ఈ మేరకు ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా కాసేపట్లో సీఎం పట్నాయక్ కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరీశీలించనున్నారు.
గత దశాబ్ధ కాలంలో అతిపెద్ద రైలు ప్రమాదం
2012
- మే 22న హంపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో, కార్గో రైలు హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో ఢీకొన్నాయి. రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పడం వాటిలో ఒకటి మంటలు చెలరేగడం వల్ల దాదాపు 25 మంది మరణించారు 43 మంది గాయపడ్డారు.
2014
- మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో, గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్, ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
2016
- నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించగా..మరో150 మందికి పైగా గాయపడ్డారు.
2017
- ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
- ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించగా దాదాపు 60 మంది గాయపడ్డారు.
2022
- జనవరి 13న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించగా 36 మంది గాయపడ్డారు.
2023
- లేటెస్ట్ గా జూన్ 2న బెంగళూరు -హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో ఒడిశాలో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదంలో233 మరణించాగా 900 మందికి పైగా గాయపడ్డారు.
మోడీ సంతాపం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందజేస్తున్నాము” అని ప్రధాని ట్వీట్ చేశారు.
18 రైల్లు రద్దు.. 33 రైళ్లు దారి మళ్లింపు
ఒడిశా రైలు ప్రమాద ఘటనతో 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 33 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. 12837 హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12863 హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12839 హౌరా-చెన్నై మెయిల్ రద్దు చేసినట్లు అధికారి తెలిపారు.
12895 హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 20831 హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, 02837 సంత్రాగచ్చి-పూరీ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ , గూడ్స్ రైలు ప్రమాదానికి గురై233 మంది మరణించగా 900 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం
మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది
మూడు రైళ్లు ఢీ.. 233మంది మృతి
ఒడిషాలో జూన్ 2న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాసేపట్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరో వైపు మృతుల్లో బెంగాల్ కు చెందిన వారు ఎక్కువగా ఉండటంతో సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎంపీ డోలాసేన్ తెలిపారు.