దవాఖాన్ల నిండా బాధితులే.. రాత్రంతా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, స్టాఫ్

దవాఖాన్ల నిండా బాధితులే.. రాత్రంతా  ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, స్టాఫ్
  •   రాత్రికిరాత్రే వందలాది యూనిట్ల రక్తం సేకరణ
  •     ఆస్పత్రుల ముందు యువత క్యూ

బాలాసోర్/కటక్: బాలాసోర్ జిల్లా ఆస్పత్రితో పాటు సోరో, భద్రక్, జాజ్ పూర్ హాస్పిటల్స్, కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీలో ఎక్కడ చూసినా రైలు ప్రమాద బాధితులే నిండిపోయారు. ఐసీయూల్లో, వార్డుల్లో, వరండాల్లో కూడా వీళ్లే కన్పించారు. సడెన్​గా ఆస్పత్రులకు వందలాదిగా బాధితులు రావడంతో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ శక్తికి మించి పనిచేయాల్సి వచ్చిందని బాలాసోర్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ మృత్యుంజయ్ మిశ్రా వెల్లడించారు. జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ 526 మంది అడ్మిట్ అయ్యారని ఆయన తెలిపారు.

ముందుగా 251 మంది క్షతగాత్రులు ఒకేసారి రావడంతో ఆస్పత్రి స్టాఫ్ ​మొత్తం ఉరుకులు పరుగులు పెడుతూ ట్రీట్ మెంట్ అందించాల్సి వచ్చిందన్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత 64 మందిని కటక్​లోని ఆస్పత్రికి పంపామన్నారు. ఇంకా 60 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతోందని, మిగతా వారికి మైనర్ సర్జరీలు చేసి డిశ్చార్జ్ చేశామని మిశ్రా వివరించారు. బాధితులకు రక్తం ఇచ్చేందుకు స్థానిక యువకులు ఆస్పత్రికి పోటెత్తారని, రాత్రికి రాత్రే 500 యూనిట్ల బ్లడ్ సేకరించామని తెలిపారు. ఆస్పత్రి వద్దకు దాదాపు 2 వేల మంది వచ్చారని, ఇది తన జీవితంలోనే మరిచిపోలేని సంఘటన అని అన్నారు. ఇక మార్చురీ నిండా మృతదేహాలు నిండిపోయాయని చెప్పారు. కాగా, ఎయిమ్స్ భువనేశ్వర్ నుంచి డాక్టర్లను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపామని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.