
ఒడిశా రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు "దెయ్యాల" భయంతో పాఠశాలలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. తాత్కాలిక శవాగారంగా ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచడానికి ప్రభుత్వం నిర్వహించే బహనాగ నోడల్ హైస్కూల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది బహనాగ బజార్ స్టేషన్ నుండి అందుబాటులో ఉన్న అతి సమీపంలో ఉంది.
శవాల నిల్వకు పాఠశాల..
బహనాగా నోడల్ హైస్కూల్‌లో శోకసంద్రంలో మునిగిపోయిన ప్రయాణికుల బంధువులతో నిండిపోయింది. తమ సన్నిహితుల మృతదేహాలను గుర్తించేందుకు వారు పాఠశాలకు చేరుకోవడంతో అక్కడి వాతావరణమంతా విషాదంతో నిండిపోయింది. మృత దేహాలన్నింటికి వసతి కల్పించేందుకు పాఠశాలలోని తరగతి గదుల్లో మృతదేహాలను భద్రపర్చాల్సి వచ్చింది.
జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి..
పాఠశాలను సందర్శించిన బాలాసోర్ కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే ఎవరూ భయపడవద్దని, మూఢనమ్మకాలను వ్యాప్తి చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. పాలనా యంత్రాంగం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, చర్చల తర్వాత సరైన నిర్ణయం వెలువరిస్తామని ఆయన అన్నారు.
బహనాగా బజార్ స్టేషన్ సమీపంలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 280 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జూన్ 2, 2023న జరిగింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయగా.. ఈ కేసులో విచారణ జరుగుతోంది.