సీఎం హెలీప్యాడ్​ కోసం పార్కు ధ్వంసం

సీఎం హెలీప్యాడ్​ కోసం పార్కు ధ్వంసం

నల్గొండ, వెలుగు :ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్​ కోసం నల్గొండ పట్టణంలోని ఐదెకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని ఆఫీసర్లు ధ్వంసం చేస్తున్నారు. దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్​ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నారు. ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్​ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నారు. మూడెకరాల్లోని నీలగిరి నందనవనంలోని వేప, మద్ది, దిరిసెన, తదితర చెట్లు పట్టణ ప్రజలను దశాబ్దాలుగా ఆహ్లాదపరుస్తున్నాయి. కానీ కొద్దిరోజలుగా వీటితో పాటు ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి తెలంగాణ హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నారు.  

ఒక్క ఎకరం చాలు..కానీ.. 

హెలీప్యాడ్​ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. ఎస్ఎల్​బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ బిల్డింగ్స్ కు వంద ఎకరాలు కేటాయించారు. అయినా ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. చర్లపల్లి సమీపంలోని 12 బెటాలియన్ వద్ద ఉన్న స్థలం కూడా సరిపోతుందంటున్నారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా కలెక్టరేట్ పక్కన సీఎం హెలిప్యాడ్​ ఉంటే బాగుంటుందని, దీనివల్ల టైం కూడా కలిసొస్తుందని కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే నిర్మిస్తున్నారు. దీని అంచనా వ్యయం సుమారు రూ.90 లక్షలు. ఆర్అండ్ బీ డిపార్ట్​మెంట్​ అంచనా మేరకు హెలీప్యాడ్ నిర్మాణానికి ఒక ఎకరం లోపు ల్యాండ్ సరిపోతుంది. కానీ పట్టణ నడిబొడ్డున నిర్మిస్తుండడంతో జనావాసాలకు ఇబ్బంది కలగకుండా ఐదెకరాలు సే కరించాల్సి వచ్చింది. హెలీప్యాడ్​ నిర్మాణం జరిగే ప్రాంతంలో 200 మీటర్ల వరకు ఐదు నుంచి పది మీటర్ల ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు, సె ల్ టవర్లు ఉండకూడదు. దీని దృష్ట్యా ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతంలో అలాంటి నిర్మాణాలన్నీ ఉండడం వల్ల ఐదెకరాల్లో హెలిప్యాడ్​ నిర్మించాల్సి వస్తోంది. 

ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు ల్యాండ్ 

ఉమ్మడి ఏపీలో 2009లో నల్గొండలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్మించేందుకు కలెక్టరేట్ కు సమీపంలోనే రెండెకరాలు కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్​లో మూడేండ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోతే స్వాధీనం చేసుకోవచ్చన్న రూల్​ను అడ్డం పెట్టుకుని తిరిగి తీసుకున్నారు. దీనికి ప్రత్యామ్నయంగా నల్గొండలో ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్ కోసం కేటాయించిన ల్యాండ్​ ఇస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు 2009లో రెవెన్యూ డిపార్ట్​మెంట్​ఐదెకరాలు కేటాయించింది. దీంతో కలుపుకుని వందల ఎకరాల్లో నీలగిరి నందనవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ వందల రకాల మొక్కలు పెరుగుతున్నాయి. ఈ ఐదెకరాల్లో మూడెకరాలు స్వాధీనం చేసుకుని బదులుగా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి ప్రాంతంలో కేటాయించారు. నల్గొండలో తొలగించిన చెట్లకు నష్టపరిహారంగా రూ.90 లక్షలు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు రిలీజ్​చేశారు. అరణ్యభవన్ నుంచి పర్మిషన్ తీసుకునే చెట్లు నరకడం, ల్యాండ్ అప్పగించడం చేశామని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు చెప్పారు.

సీఎం హెలీప్యాడ్​ కోసం నల్గొండ పట్టణంలోని ఐదెకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని ఆఫీసర్లు ధ్వంసం చేస్తున్నారు. సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నారు. ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్​ కోసం పెద్ద పార్కునే నాశనం చేస్తున్నరు.