ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రాపర్టీ ట్యాక్స్

ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రాపర్టీ ట్యాక్స్

హైదరాబాద్, వెలుగు: ఓ వైపు జీహెచ్ఎంసీకి రోజురోజుకు ఆదాయం తగ్గిపోవడం, మరోవైపు అప్పులు పెరిగిపోతుండడంతో నిధులు పెంచుకునేందుకు ఆఫీసర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బల్దియాకు ప్రధాన ఆదాయం వనరు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. ఏటా పెట్టుకుంటున్న టార్గెట్ రీచ్ కాకపోతుండడంతో ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్షన్ బాధ్యతలను ప్రైవేట్​ఏజెన్సీలకు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే జీహెచ్ఎంసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా పైసలు నేరుగా వచ్చి ఖజానాలో పడిపోతాయి. అయితే ప్రజలపై ఏజెన్సీల ఒత్తిడి తీవ్రమయ్యే అవకాశం ఉంది. బెంగళూరు, ముంబై నగరాల్లో ఇప్పటికే ప్రైవేట్​ఏజెన్సీల ద్వారానే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్​లో చేయాలని ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 300 మంది బిల్ కలెక్టర్లు,145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. ఉన్నతాధికారులు ఆశించిన టార్గెట్​ను వీళ్లు రీచ్​కాలేకపోతున్నారు. ఏటా కలెక్షన్​టార్గెట్ పెంచుతుండడంతోనే ఇలా జరుగుతుందని పలువురు బిల్ కలెక్టర్లు అంటున్నారు. ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నిసార్లు తిరిగినా ప్రజలు ట్యాక్స్​కట్టట్లేదని, ఇలాంటి చోట్ల ఎలా వసూలు చేయాలని వాపోతున్నారు. ఇలాంటి మొండి బకాయిలను ప్రైవేట్ ఏజెన్సీలు వసూలు చేస్తాయని బల్దియా ఆఫీసర్లు నమ్ముతున్నారు.

మొండి బకాయిలు

ఏటా ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్షన్​టార్గెట్​ను జీహెచ్ఎంసీ రీచ్ కాలేకపోతుంది. మొదట్లో 1,500కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల ఆస్తి పన్నులు రాబట్టాలని అనుకుంటున్నప్పటికీ వీలు కావడం లేదు. మూడేళ్లుగా వచ్చిన ఆస్తి పన్నులను చూస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22లో రూ.1,495 కోట్లు వచ్చింది. వీటిలో ఎర్లీబర్డ్ స్కీం టైంలో చెల్లించిన మొత్తమే ఎక్కువగా ఉంటోంది. గత నెలలో ఎర్లీ బర్ట్​ కింద రూ.748 కోట్ల ఆదాయం వచ్చింది. దీని ప్రకారం చూస్తూ ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్​కట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కలెక్షన్ లోపంతోనే రావడం లేదని బల్దియా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలకు అప్పగిస్తే కచ్చితంగా వర్క్​అవుట్​అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.