- కొందరు టాపర్లకూ సమాచారం ఇవ్వని వైనం
- మూడు రోజుల్లోనే వెరిఫికేషన్, సెలక్షన్, జాయినింగ్
- భారీగా డబ్బులు చేతులు మారాయంటూ అభ్యర్థుల ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ నిర్వహించే రిక్రూట్‌మెంట్లపై ఇప్పటికే అనేక ఆందోళనలు కొనసాగుతుండగా.. తాజాగా కేజీబీవీ, యూఆర్ఎస్‌లో కాంట్రాక్టు పోస్టుల భర్తీపైనా అనేక అనుమానాలు మొదలయ్యాయి. గుట్టుగా నాలుగు రోజుల్లోనే రిక్రూట్‌మెంట్‌ను ముగిస్తుండటమే ఇందుకు కారణం. కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం), యూఆర్ఎస్ (అర్బన్ రెసిడెన్షియల్)ల్లోని పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను గురువారం రాత్రి వెబ్‌సైట్‌లో సమగ్ర శిక్షా అధికారులు పెట్టారు. శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి, శనివారం సెల క్షన్ లిస్టులను వెబ్‌సైట్‌లో పెట్టి, ఆదివారం జాబ్‌లో జాయిన్ కావాలని ఎస్ఎస్‌ఏ ఎస్‌పీడీ శ్రీదేవసేన ఆదేశాలిచ్చారు. ఈ ఉత్తర్వులను శుక్రవారం డీఈఓలకు పంపగా.. ఉత్తర్వుల్లో మాత్రం బుధవారమే పంపించినట్టు పేర్కొనడం గమనార్హం.
రాత్రి పూట అభ్యర్థులకు ఫోన్లు చేసి..
రాష్ట్రంలోని కేజీబీవీ, యూఆర్ఎస్‌లలో 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గత నెలాఖరులో సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. 43,056 మంది అప్లై చేసుకోగా, 34,797 మంది పరీక్షలకు హాజరయ్యారు. గురువారం రాత్రి ఫలితాలు రిలీజ్ చేసి, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పెట్టారు. కొత్త రోస్టర్ తయారుచేసి, 1:3 రేషియోలో ఎంపికైన అభ్యర్థులకు రాత్రిపూట ఫోన్లు చేసి, శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలిచ్చారు. టాప్ మెరిట్ అభ్యర్థుల్లో కొందరికి ఫోన్లు చేయలేదు. దీంతో కొందరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అటెండ్ కాలేదు.
మరోవైపు గతంలో కొన్ని జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులకు ఖాళీగా చూపించని అధికారులు.. ఇప్పుడు మాత్రం వేకెన్సీ ఉన్నట్టు చూపిస్తున్నారు. ప్రస్తుతం కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 5% గ్రేస్ మార్కులు ఇవ్వగా, కంప్యూటర్ ఇన్‌స్ర్టర్టర్లు, ఒకేషనల్ ఇన్‌స్ర్టక్టర్లకు మాత్రం ఆ మార్కులను కలపలేదు. వారంతా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నా.. వారిని పక్కన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం మెరిట్ లిస్టులను వెబ్ సైట్లలో పెట్టగా, హాలీడే అయిన సరే సండే రోజు జాయిన్ కావాలని ఆదేశించారు. కేజీబీవీ, యూఆర్ఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కనీసం ఒక్కరోజు కూడా సమయంఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.