మళ్లీ పెరుగుతున్న గోదావరి.. తీర ప్రాంతాల ప్రజల అప్రమత్తం

మళ్లీ పెరుగుతున్న గోదావరి..  తీర ప్రాంతాల ప్రజల అప్రమత్తం

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆఫీసర్లు హై అలర్ట్‌‌ ప్రకటించారు. గోదావరిలో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంగళవారం 1.30 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉండగా బుధవారం 3.72 లక్షలకు పెరిగింది. నదికి ఎగువన భారీ వర్షాలు పడుతుండడంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

 ఆఫీసర్లకు ఇచ్చిన సెలవులను రద్దు చేశారు. రెవెన్యూ, ఐబీ, ఇతర శాఖ ఆఫీసర్లను అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రెస్య్కూ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా వాహనాలను అందుబాటులో ఉంచారు. దీన్నంతా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా  ఏర్పాట్లు చేశారు.  

రెండు జిల్లాల్లో వందకు పైగా ముంపు గ్రామాలు 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి వందకు పైగా ముంపు గ్రామాలున్నాయి. జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వరదలతో మోరంచపల్లె, కొండాయి గ్రామాలు నీట మునిగి 12 మందికి పైగా చనిపోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వందలాది ఇండ్లు నేలమట్టం కాగా,  వేలాది పశువులు చనిపోయాయి. రెండు వందలకు పైగా చెరువులు తెగిపోయాయి. దీంతో ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా ఆఫీసర్లు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. 

మత్తడి దగ్గర వలలను తొలగించాలని ఆదేశం

చెరువుల మత్తళ్ల దగ్గర మత్స్యకారులు కట్టే వలలను తొలగించాలని మత్స్యశాఖ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వానలకు అధిక సంఖ్యలో చెరువులు తెగడానికి మత్తళ్ల దగ్గర వలలు కట్టడమే కారణమని ఆఫీసర్లు గుర్తించారు. దీంతో చెరువుల్లో చేపలు కిందికి వెళ్లకుండా కట్టిన వలలను తొలగించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏయే మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వరదలు వస్తున్నాయో..ముందుగానే తెలుసుకునే ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేవిధంగా చర్యలు చేపట్టారు.  

చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు 

భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు జిల్లాలోని అన్ని శాఖల ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్‌‌ ప్రకటించారు. పీఆర్, ఆర్అండ్ బీ, ఇరిగేషన్​ఇంజినీర్లు సంబంధిత తహసీల్దార్లకు అందుబాటులో ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు. ఇరిగేషన్ ఏఈలకు వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వాగులు పొంగి పొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమై రాకపోకలు ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రమాదానికి ఆస్కారం ఉన్న చోట్లతో పాటు అవసరం ఉన్నచోట రోడ్లను మూసివేయాలని, భద్రత ఏర్పాటు చేయాలన్నారు.  ప్రమాదకర చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఆఫీసర్లు కేటాయించిన మండలం, గ్రామాల్లో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. రాకపోకలు నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రవాహానికి రెండు వైపులా ట్రాక్టర్లు అడ్డంగా పెట్టాలన్నారు.