ఆఫీసర్స్​ ఆన్​ డ్యూటీ.. బల్దియా సిబ్బంది పనితీరులో మార్పు

ఆఫీసర్స్​ ఆన్​ డ్యూటీ.. బల్దియా సిబ్బంది పనితీరులో మార్పు
  • కొత్త సర్కార్ వచ్చిన వెంటనే చేంజ్
  • అధికారుల్లోనూ మారిన వర్కింగ్  స్టైల్
  • వరుస సమీక్షలు, పనుల ప్రగతిపై ఆరా
  • గత ప్రభుత్వ హయాంలో రివ్యూలే లేవు
  • ఏ పనికైనా మున్సిపల్  మంత్రి ఆర్డర్స్ పైనే..

హైదరాబాద్, వెలుగు:  కొత్త ప్రభుత్వం వచ్చాక బల్దియా అధికారుల పనితీరులోనూ మార్పు కనిపిస్తుంది. పనుల నుంచి మొదలుకొని మీటింగ్ ల వరకు వర్కింగ్ స్టైల్ కూడా మారింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు కాదు. ఎలాంటి మీటింగ్ లు ఏర్పాటు చేయలేకపోయారు.  అప్పటి మంత్రి కేటీఆర్ సమక్షంలోనే అన్ని పనులూ జరిగేవి. జనం నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేటీఆర్​ట్వీట్​చేస్తేనే తప్ప ఉన్నతాధికారులు మీటింగ్ లు, సమీక్షలు నిర్వహించేవారుకాదు. ఇప్పుడా ఆ పరిస్థితులు కనిపించడంలేదు. అప్పట్లో కొందరు అధికారులు ఇతరులతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా భయపడే వారు.  గత ప్రభుత్వ పాలనలో కిందిస్థాయి అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్న ఎన్నో ఆలోచించేవారు. ప్రస్తుతం డిపార్టుమెంట్ల వారీగా అడిషనల్ కమిషనర్లు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగే పనులతో పాటు చేయాల్సిన  వాటిపైనా ఆరా తీస్తున్నారు. బల్దియా నిర్ణయాలు, పెండింగ్ పనులు, కొనసాగే పనులపై ఎప్పటికప్పుడు సర్కార్ కు రిపోర్టు అందజేస్తున్నారు.

ఆఫీసర్ల పనితీరుపై సర్కార్ దృష్టి

కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజుల్లోనే కొందరు అధికారులను బదిలీలు చేయడం. లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ఆఫీసర్ల వివరాలపైనా ఫోకస్ పెట్టింది.  దీంతో  అధికారులు ఎవరి పనులు వారు సమగ్రంగా నిర్వహించాలని చూస్తున్నారు.  మరో నాలుగు రోజుల్లో బల్దియా అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించనున్నారు.

ప్రజావాణి, కో ఆర్డినేషన్ మీటింగ్ లు కూడా..

బల్దియాలో కరోనా కారణంగా 2020 మార్చి 17న  ప్రజావాణి ప్రోగ్రామ్ నిలిచిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా కొనసాగించలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే ప్రజావాణి స్టార్ట్ అయింది. అలాగే ప్రత్యేక  రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటీ సమన్వయ కమిటీ సమావేశాలు  ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశాలు నిర్వహించడంతో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బల్దియా ఆ విషయాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహిస్తున్నారు.  రెగ్యులర్ గా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇలా జనం నుంచి డిమాండ్ ఉన్నా కూడా ప్రారంభించనప్పటికీ, ఇప్పుడు వాటికవే ప్రారంభం అవుతున్నాయి.