జీహెచ్ఎంసీ సమావేశానికి అధికారుల సన్నాహాలు

జీహెచ్ఎంసీ సమావేశానికి అధికారుల సన్నాహాలు
  • ఏప్రిల్ 8 లేదా 9న నిర్వహించేందుకు ఏర్పాట్లు    
  • 2022–-23 బడ్జెట్​ను ఆమోదించనున్న కౌన్సిల్​  
  • గ్రేటర్  సమస్యలపై కార్పొరేటర్ల నుంచి ప్రశ్నలు తీసుకున్న అధికారులు

హైదరాబాద్​, వెలుగు: బల్దియా కౌన్సిల్ మీటింగ్ వచ్చే నెల 8 లేదా 9వ తేదీన జరగనున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్​ 8 వరకు కొనసాగనుండటంతో 9న కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అంతకు ముందే పార్లమెంట్​ సమావేశాలు ముగిస్తే  8వ తేదీనే కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ లో ఉన్న సమస్యలపై కార్పొరేటర్ల నుంచి ఇప్పటికే ప్రశ్నలను కూడా సేకరించారు.

2022–-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూపొందించిన రూ.6,150 కోట్ల బడ్జెట్​కి కౌన్సిల్​ఆమోదం తెలపనుంది.  ఇదివరకే స్టాండింగ్​ కమిటీ అప్రూవల్​ పొందిన పలు పనులను ఆమోదించనున్నారు. కిందటేడాది డిసెంబర్ లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలపై పెద్దగా చర్చలు జరగలేదు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అన్నింటిపై వివరంగా చర్చించాలని కార్పొరేటర్ల కోరుతున్నారు.  గతంలో మాదిరిగా అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా దాటువేయవద్దని కోరుతున్నారు.
ఫిజికల్​గా బడ్జెట్ మొదటి సమావేశం ఇదే
ప్రస్తుత  కౌన్సిల్​ ఏర్పడిన తర్వాత మొదటిసారి  ఫిజికల్ గా జరుగుతున్న బడ్జెట్ సమావేశం ఇదే  కానుంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు అప్పట్లో ఉన్న స్టాండింగ్​ కమిటీ 2021–22 బడ్జెట్​కి ఆమోదం తెలిపినప్పటికీ  పలు కారణాల వల్ల అప్పటి కౌన్సిల్ బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం లేకుండా పదవీకాలం ముగిసింది.  కొత్త కౌన్సిల్​ ఏర్పడిన తర్వాత సభ్యులు ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత  కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో సమావేశాన్ని  జూన్​ 29న వర్చువల్​ గా ఏర్పాటు చేశారు. అదే  మీటింగ్ లో బడ్జెట్​కి ఆమోదం తెలిపారు. ఇప్పుడు తొలిసారిగా  ఫిజికల్ గా బడ్జెట్​ సమావేశం జరగనుండటంతో  కౌన్సిల్ లో ప్రధానంగా బడ్జెట్ పైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
వీటిపైనే బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఫోకస్
వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని, కార్పొరేటర్లకు ఫండ్స్​ కేటాయించాలని, అర్హులైన వారికి డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు ఇవ్వడంతో పాటు స్థలం ఉన్నోళ్లకు అక్కడే ఇండ్లను నిర్మించాలని, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య, మోడల్​ మార్కెట్లు తదితర అంశాలపై నిలదీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.  ప్రజా సమస్యలపై వివరంగా చర్చిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. ఏదో నామ్​ కే వాస్తేగా సమావేశాలు పెట్టడం సరికాదంటున్నారు.  గతంలో మాదిరిగా కాకుండా  రెండు, మూడ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించి చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరంగా చర్చించాలె.. 
 గ్రేటర్ లో ప్రజా సమస్యలపై వివరంగా చర్చించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలె. ప్రతి సభ్యుడు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వాలె. గతంలో జరిగిన సమావేశాల్లో ఏ  ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ సారి   సమావేశంలో అన్నింటిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలె. వచ్చే వర్షాకాలంలో మళ్లీ సమావేశం జరిగే అవకాశం లేదు. అందుకే ఈ సమావేశంలోనే నాలాలపై సంబంధించి వివరంగా చర్చించాలె.  –కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్​ కార్పొరేటర్