ఐదున్నర లక్షల మంది రైతులు.. రూ.6 వేల కోట్ల రుణాలు!

ఐదున్నర లక్షల మంది రైతులు.. రూ.6 వేల కోట్ల రుణాలు!
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్న ఆఫీసర్లు
  • ప్రభుత్వ విధివిధానాలు వస్తేనే ఫుల్ క్లారిటీ 
  • పాత రుణాలకు వర్తింపజేయాలంటున్న రైతులు

ఖమ్మం, వెలుగు : ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో, అందుకు తగిన విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2018 డిసెంబర్​ 12 నుంచి, 2023 డిసెంబర్​ 9 వరకు తీసుకున్న రూ.2 లక్షల్లోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆ తేదీల్లోపు రుణం తీసుకున్న వారి జాబితాను ఆఫీసర్లు సిద్ధం చేస్తున్నారు. డీసీసీబీలు, పీఏసీఎస్​లు, ఏపీజీవీబీతోపాటు ఎస్​బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లోనూ లోన్లు తీసుకున్న వారి డేటాను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

గతేడాది డిసెంబర్​ 31నాటికి వేర్వేరు బ్యాంకుల్లో కలిపి ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులు రూ.4,307.58 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.1,85,034 మంది రైతులు రూ.1,816.35 కోట్లు రుణాలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. వారిలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీ నాటికి ఎంత మంది రైతులు, ఎన్ని కోట్లు రుణాలో తీసుకున్నారో లెక్కలేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో విధివిధానాలు వస్తే అర్హుల సంఖ్య, రుణమాఫీ మొత్తంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

కొందరిలో టెన్షన్.. 

ఉమ్మడి జిల్లాలో పంట రుణాలు ఇచ్చే బ్యాంకులు 17 ఉండగా, ఆయా బ్యాంకులు 400కు పైగా ఉన్న బ్రాంచీల ద్వారా 3.75 లక్షల మంది రైతులు ప్రతియేటా రూ.3 వేల కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్​ 11 వరకు కుటుంబంలో ఒకరి చొప్పున రూ.లక్ష లోపు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లాలోనే 3.25 లక్షల మంది రైతులు రూ.2,428 కోట్లు పంట రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. 

వీరిలో అర్హులైన వారికి నాలుగు విడతలుగా 1,11,962 మంది రైతులకు చెందిన రూ.510.63 కోట్లు మాఫీ చేసింది. ఇంకా వేర్వేరు కారణాల వల్ల జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు చెందిన రూ.వెయ్యి కోట్ల వరకు మాఫీ జరగలేదు. అలాంటి వారిలో సహకార సంఘాలకు చెందిన రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో మాఫీ వర్తించని వారి రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తారా లేదా అనే టెన్షన్​ లో కొందరు రైతులున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష రుణమాఫీ ప్రకటించిన బీఆర్ఎస్, ఆ తర్వాత ఆ స్కీమ్​ను అమలు చేసేందుకు ఐదేళ్ల పాటు సాగదీసింది. 

విడతల వారీగా బ్యాంకులకు చెల్లిస్తూ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఈ సమయంలో సకాలంలో బ్యాంకు రుణాలను రెన్యువల్ చేయించని వారికి, అసలు వడ్డీ కలిపి రూ. లక్ష దాటిన వారికి రుణమాఫీ జరగలేదు. గత ప్రభుత్వంలో మాదిరిగానే రుణాలను రెన్యువల్​ చేయించని వారిని అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో, సహకార సొసైటీల్లో లోన్లు తీసుకొని ఉన్న వేలాది మంది ఇప్పుడు టెన్షన్​ పడుతున్నారు. 

ప్రతియేటా వడ్డీ కడ్తున్న.. 

నాకు మూడు బ్యాంకుల్లో 2018 ముందు నుంచి క్రాప్ లోన్, వ్యవసాయ గోల్డ్ లోన్ కలిపి రూ.2లక్షల వరకు ఉంది. ప్రతియేటా మూడు బ్యాంకుల్లో వడ్డీ చెల్లించి రెన్యువల్ చేస్తున్నాను. కానీ ఇంత వరకు ఏ ఒక్క బ్యాంకు లోను రుణ మాఫీ అవ్వలేదు. ఇదే విషయమై బ్యాంకుల మేనేజర్లను అడిగితే లిస్టు లో నా పేరు లేదని, వడ్డీ కట్టాలని చెబుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు మాఫీ చేయలేదు.. ఇప్పటి వరకు నేను తీసుకున్న వ్యవసాయ రుణాలపై లక్ష రూపాయలకు పైగా వడ్డీ కట్టాను. 
- నిలపాల నరసింహారావు, రైతు, 
కల్లూరు గూడెం గ్రామం 

మాకూ మాఫీ వర్తింపజేయాలి

నా పేరు మీద 2017లో రూ.లక్ష, నా భార్య నాగమ్మ పేరు మీద రూ.లక్ష ఖమ్మం ఎస్​బీఐ లో రైతు రుణం తీసుకున్నాను. 2019–20 మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోఒకేసారి లక్ష మాఫీ అంటే మా ఇద్దరి పేరుమీద రెన్యువల్ కు ఒకేసారి రూ.1,10,000 కట్టాం. కానీ రుణమాఫీ రాలేదు. తర్వాతనైనా రుణమాఫీ వర్తిస్తుందని రెన్యువల్ చేస్తూ మూడుసార్లు రూ.14 వేలు చొప్పున 42,000 కట్టాం. అయినా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. ఇప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు రుణమాఫీ వర్తింపజేయాలి.
- కాంసాని నర్సింహారావు, యడవల్లి లక్ష్మీపురం, ముదిగొండ మండలం