మహిళా సంఘాలకు.. ఉత్తుత్తి చెక్కు !

మహిళా సంఘాలకు.. ఉత్తుత్తి చెక్కు !

పంద్రాగస్టు రోజున మండలి చైర్మన్  గుత్తా  చేతుల మీదుగా అందజేత
గతంలో  రూ.316 కోట్లు శాంక్షన్​
వాటినే కొత్తగా ఇచ్చినట్లు చూపడంపై విమర్శలు

నల్గొండ, వెలుగు :   నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి  సంస్థ ఆఫీసర్లు పాత రుణాలనే  కొత్తగా ఇచ్చినట్టు చూపించి బురిడీ కొట్టించారు. పంద్రాగస్టు రోజున జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నట్లు ఉత్తుత్తి  చెక్కు అందజేశారు. కొన్నేండ్ల కింద ఇదేవిధంగా చెల్లని చెక్కు అందజేసి నవ్వులపాలైన ఆఫీసర్లు.. మళ్లీ ఇప్పుడు అదే చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పంద్రాగస్టు వేడుకల్లో బయటపడ్డ నిర్వాకం

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 2023–-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని 19,890 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.911  కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. దీంట్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4,410 సంఘాలకు రూ.316 కోట్లు శాంక్షన్ చేశారు.  లింకేజీ రుణాలు ఇప్పించడంలో ఆఫీసర్లు,  బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,  శాంక్షన్ చేసిన రుణాలనే బ్యాంకర్లు గ్రౌండింగ్​ చేయడం లేదని ఇటీవల కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ బ్యాంకర్ల  మీటింగ్​లో ఫైర్​అయ్యారు. 

ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే ఆఫసీర్లు అవే రూ.316 కోట్లను పంద్రాగస్టు వేడుకల్లో సంఘాలకు ఇస్తున్నట్లు మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్​ రెడ్డి చేతుల మీదుగా చెక్కు పంపిణీ చేశారు. ప్రతీ ఏడాది పంద్రాగస్టు వేడుకల్లో వివిధ శాఖల నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి రుణాలు కొత్తగా శాంక్షన్​ చేస్తారు. 

అప్పటికే  డిపార్ట్​మెంట్​నుంచి మంజూరు చేసి,  గ్రౌండింగ్​ చేసిన యూనిట్లు కాకుండా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. కొన్నేండ్లుగా కరోనా, ఇతర విపత్కర పరిస్థితుల వల్ల ఆస్తుల పంపిణీ  కార్యక్రమం సవ్యంగా సాగలేదు.  ఈసారి 77 ఏండ్ల వేడుకల కోసం అన్నిశాఖల సమన్వయంతో కలెక్టర్​ ఘనంగా ఏర్పాట్లు చేశారు.  సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖలు తయారు చేసిన ఉత్పత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇదే రీతిలో లబ్ధిదారులకు కొత్తగా ఆస్తుల పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. డీఆర్​డీఏ, మెప్మా, ఇండస్ట్రీస్​, ఎస్సీ కార్పొరేషన్​ శాఖల నుంచి లబ్ధిదారులకు రూ.323 కోట్ల ఆస్తులు పంపిణీ చేశారు.  దీంట్లో రూ.316 కోట్లు మహిళా సంఘాల రుణాలే ఉండడం గమనార్హం.

గ్రౌండింగ్ చేసిన వాటికే మళ్లీ కొత్త చెక్కు

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు మహిళా సంఘాలకు రూ.316 కో ట్ల రుణాలు శాంక్షన్  చేశారు. దీంట్లో రూ.287కోట్లు గ్రౌండింగ్​ పూర్తయింది. బ్యాలెన్స్​ రూ.29 కోట్లు గ్రౌండింగ్​ దశలో ఉన్నాయి. పంద్రాగస్టు వేడుకలకు కొత్తగా లబ్ధిదారులను సెలక్ట్​ చేసి, వాళ్ల పేరు మీద చెక్కులు ఇవ్వాలి.  కానీ ఆఫీసర్లు అత్యుత్సాహంతో గత ఐదు నెలల్లో సంఘాలకు శాంక్షన్​ చేసిన రుణాల మొత్తాన్ని కలిపి ఒక డమ్మీ చెక్కు తయారు చేయించారు. లబ్ధిదారులకు బదులు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, మేనేజర్​, బ్యాంకు లింకేజీ డీపీఎం కలిసి మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి చేతుల మీదుగా రూ.316 కోట్ల చెక్కు తీసుకున్నారు. లబ్ధిదారులు రాలేదా.. అని అడిగితే ఆ పైసలు ఎప్పుడో సంఘాల ఖాతాల్లో పడ్డాయని, వాటిన్నింటికి కలిపి ఉత్తి చెక్కు మాత్రమే ఇచ్చారని బ్యాంకర్లు చెప్పడం గమనార్హం.

మెప్మాను చూసినా నేర్వలే

పట్టణాల్లో మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)పనితీరును చూసైనా ఆఫీసర్లు  మారడం లేదు. పంద్రాగస్టు వేడుకల్లో మెప్మా పంపిణీ చేసిన రూ.6కోట్లు కొత్తవే. ఈ ఆర్థిక సంవత్సరానికి మెప్మా టార్గెట్​ రూ.50కో ట్లు కాగా, దీంట్లో  గత ఐదు నెలల్లో రూ.35 కోట్లు శాంక్షన్​ చేశారు. ఇవి గాక అదనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  కొత్తగా మరో రూ.6 కోట్లు 67 సంఘాలకు శాంక్షన్​ చేశారు. 

ఆల్రెడీ డబ్బులు తీసుకున్నరు

జిల్లాలోని అన్ని మహిళా సంఘాలకు కలిపి శాంక్షన్ చేసిన చెక్కు అది. ఆ డబ్బులు ఆల్రెడీ సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఓరల్​గా చూడడానికి మాత్రమే చెక్కు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో మహిళలకు ఇచ్చిన రుణాలవి.

నాగమణి,  జిల్లా మహిళా సమాఖ్య​ అధ్యక్షురాలు