రాజకీయ ఒత్తిళ్లకు ఆఫీసర్లు తలొగ్గొద్దు: ఎమ్మెల్యే రఘునందన్​రావు

రాజకీయ ఒత్తిళ్లకు ఆఫీసర్లు తలొగ్గొద్దు: ఎమ్మెల్యే రఘునందన్​రావు

జడ్పీ స్టాండింగ్​ కౌన్సిల్​ మీటింగ్​లో ఎమ్మెల్యే రఘునందన్​ రావు

మెదక్​ టౌన్, వెలుగు:  జిల్లా అధికారులు  రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు సూచించారు.  శుక్రవారం మెదక్​ జడ్పీ స్టాండింగ్​ కౌన్సిల్​ సమావేశాన్ని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్​పర్సన్​ హేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట మండలం ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి,  నిజాంపేట మండలం కోనాపూర్​ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవినీతిపై జిల్లా సహకార శాఖ కార్యాలయ అధికారి పండిత్​ వివరిస్తుండగా ఎమ్మెల్యే రఘునందన్​రావు  కలుగజేసుకొని మాట్లాడారు. ఈ మూడు ప్రాంతాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేశారా ? అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేశారా ? అని ఆయన ప్రశ్నించగా ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. పూర్తి సమాచారం లేకుండా ఎందుకు సమావేశాలకు వస్తారని, ప్రజల సొమ్ము స్వాహా చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా అలాగే వదిలేస్తారా అని ఆఫీసర్ల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా సహకార శాఖ అధికారిణి ఇబ్రహీంపూర్, కోనాపూర్, రెడ్డిపల్లికి సంబంధించిన పూర్తి సమాచారంతో సోమవారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసుకు వచ్చి తెలుపాలని సూచించారు. 

‘ఉపాధి’కి చొరవ చూపాలి.. 

చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో ఫ్యాక్టరీలు ఉన్నందున స్థానికులకు ఉపాధి కల్పించే విషయంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే జిల్లా అధికారి రామరాజును ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి ఎంత మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించారనే వివరాలను తెలియజేయాలని సూచించారు. 

‘ఆర్టీసీ’ తీరుపై జడ్పీ చైర్​పర్సన్​ ఆగ్రహం 

మనోహరాబాద్​ వద్ద మెదక్​ డిపోకు చెందిన డీలక్స్​ బస్సులు నిలపడంలేదని జడ్పీ చైర్​పర్సన్​ హేమలత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్కిబండ, పోతారంకు బస్సులు నడపాలని సూచించారు. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించినా మెదక్​ ఆర్డీసీ డిపో మేనేజర్​ ఒక్కసారి కూడా రాకపోవడంపై ఆమె సీరియస్​ అయ్యారు. ఇదిలా ఉండగా ఆయా శాఖలపై జరగాల్సిన స్టాండింగ్​ కమిటీ మీటింగు​లు అనివార్య కారణాలతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో వెంకట శైలేశ్​ తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు మాధవి, సుజాత, బబ్యానాయక్​, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్​, మైనింగ్​ ఆఫీసర్​ జయరాజ్, డీఎస్​డబ్ల్యూవో  నాగరాజు, డీఐసీ కృష్ణమూర్తి, డీపీవో తరుణ్​కుమార్, ఉపాధికల్పన శాఖ అధికారి రామరాజు, పీసీబీ ఈఈ కుమార్​ తదితరులు పాల్గొన్నారు. 

క్రీడామైదానాల మంజూరుకు కృషి 

జిల్లాలో కొత్తగా క్రీడామైదానాలు ఎక్కడ నిర్మిస్తున్నారని జడ్పీ చైర్​పర్సన్​ హేమలత జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజును ప్రశ్నించగా నర్సాపూర్,  మెదక్​లో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని, అక్కడ అలాట్ చేయకపోవడంతో వేరే ప్రాంతాల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సమాధానం చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 28న పార్లమెంట్​సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఖేలో ఇండియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సింగిల్ పేజీలో తనకు సమాచారం ఇవ్వాలని, ఆ శాఖ ఎండీ సందీప్ ​కుమార్​ సుల్తానియాతో మాట్లాడి త్వరగా క్రీడా మైదానాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.