ప్రాజెక్టులకు భూములిచ్చి..రైతుబంధుకు దూరమైన్రు

ప్రాజెక్టులకు భూములిచ్చి..రైతుబంధుకు దూరమైన్రు

సేకరించిన భూమి కాకుండా మొత్తం సర్వే నంబర్ బ్లాక్ చేసిన ఆఫీసర్లు
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, కాలువల కోసం భూములిచ్చిన రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువ పరిహారం ఇస్తున్నారనే బాధ ఒకవైపు ఉండగా, మరోవైపు ఆఫీసర్ల తప్పిదాల వల్ల రైతుబంధుకు దూరం అవుతున్నారు. ఒక సర్వే నంబర్లో ఒక రైతు నుంచి సేకరించిన భూమిని మాత్రమే కాకుండా మొత్తం భూమిని బ్లాక్ చేయడంతో ఈ సమస్య వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేలాది ఎకరాల మిగులు భూముల వివరాలను రెవెన్యూ శాఖ ఆన్ లైన్ లో నమోదు చేయకపోవడం వల్లే తాము రైతుబంధు కోల్పోవాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు.

వెలుగు, నెట్ వ‌ర్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు సేకరించిన పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలతో పాటు నారాయణపేట, నాగర్ క‌ర్నూల్ జిల్లాల్లో రైతులు రైతుబంధు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి జూన్16 నాటికి ఆన్ లై న్ లో నమోదు చేసిన భూములకే ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో వేసింది. కానీ ప్రాజెక్టులు, కాలువల కోసం ఇరిగేషన్ శాఖ భూములు సేకరించిన గ్రామాల్లో మాత్రం సమస్య ఎదురైంది. ఆయా గ్రామాల పరిధిలో తాము సేకరించిన భూముల వివరాలను రెవెన్యూ శాఖకు అందజేశామని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ ప్రకారం సేకరించిన భూమి విస్తీర్ణాన్ని మాత్రమే తమ రికార్డుల్లో తొలగించి, మిగిలిన భూమి వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు టైం లేకో, మరే కారణమో తెలియదుగానీ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన సర్వే నంబర్లలోని ఆయా రైతుల మొత్తం
భూమిని ఆన్ లైన్ లో ఎంటర్ చేయలేదు.

దీంతో ఆయా జిల్లాల్లోని వేలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోయింది. కొన్నిమండలాల్లో ఇరిగేషన్ ఆఫీసర్లు గడువులోగా వివరాలు ఇవ్వకపోవడం వల్లే తాము నమోదు చేయలేకపోయామని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. మరోవైపు ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ తదితర సాగునీటిప్రాజెక్టుల కోసం దశాబ్దాల క్రితం సేకరించిన భూముల్లో కొన్ని రైతుల పేర్ల మీదే ఉండిపోయాయి. ఇటీవల ఇరిగేషన్ ఇన్వెంటరీ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు రైతుల పేర్ల మీద ఉన్నభూములను రెండు నెలలుగా ప్రాజెక్టుల పేర్ల మీదకి మ్యూటేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనూ సర్వే నంబర్ల‌ను బ్లాక్ లో పెట్టడం వల్ల కూడా వందలాది మంది రైతులు రైతుబంధు కోల్పోయారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 500కు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నారాయణపేట జిల్లాలో ని సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కోసం ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండలాల్లో1,098 మంది రైతుల నుంచి 621 ఎకరాల 23 గుంటల భూమి సేకరించారు. కెనాల్ లో పోయిన భూముల విస్తీర్ణానికి అదనంగా 350 ఎకరాలను రికార్డుల నుంచి తొలగించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకం కింద సేకరించిన
భూములకు సంబంధించి ఇదే సమస్య నెలకొంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన 36 మంది రైతులకు పైసా పరిహారం ఇవ్వకముందే వారి భూముల వివరాలను రెవెన్యూ ఆఫీసర్లు రికార్డుల్లోంచి తొలగించారు. రెండేళ్లు రైతుబంధు అందకపోవడంతో రైతులు కోర్టుకు వెళ్లారు. కోర్ట్ ఆదేశాలతో వీరికి ఈ సారి రైతుబంధు అందింది. కానీ ఆఫీసర్లు చేసిన పొరపాటు కారణంగా తాము రెండేళ్ల‌పాటు పెట్టుబడి సాయం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల కింద 21,837 ఎకరాలకు 18,976 ఎకరాలను ఆఫీసర్లు సేకరించారు.

భూ సేకరణ జాబితాలో ఉన్న మెజారిటీ రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. కానీ రికార్డుల్లోంచి వారి పేర్ల‌ను తొలగించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా రెవెన్యూ రికార్డుల్లో పేరు, వివరాలు బ్లాక్ అయిన రైతులు తిరిగి అప్లై చేసుకోవాలని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. వారు చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు రైతులే అప్లై చేసుకోవాలనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఎస్సారెస్పీ కాల్వల కోసం భూములను సేకరించారు. రెండు నెలల క్రితం ఇరిగేషన్ ఇన్వెంటరీ కార్యక్రమంలో భాగంగా రైతుల పేర్ల మీద ఉన్న భూములను ప్రాజెక్టుల పేర్ల మీదికి మ్యూటేషన్ చేశారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఆయా సర్వే నంబర్లలో సేకరించిన భూమిని కాకుండా మొత్తం భూమిని బ్లాక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 3 వేల ఎకరాల భూమికి సంబంధించి రైతు బంధు నిలిచిపోగా, సుమారు 500 ఫిర్యాదులు వచ్చాయని ఆఫీసర్లు అంటున్నారు.

నాకు7.19 ఎకరాల సాగుభూమిఉంది. ఇందులో 24 గుంటలను సంగంబండ రిజర్వాయర్ కెనాల్కోసం తీసుకున్నరు. కానీనా సర్వే నంబర్ మొత్తాన్ని బ్లాక్లో పెట్టిన్రు.మొత్తం ఏడుఎకరాలను ఆన్ లైన్ లో తీసేసిన్రు. దీంతో నాకు రైతుబంధు వస్తలేదు. న్యాయం చేయాలని తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు.
– వాకిటి లక్మణ్, రైతు, మగానూర్, నారాయణపేట జిల్లా

నా మూడెకరాలకు రైతుబంధు ఇస్తలేరు

నాకున్న 6 ఎకరాల16గుంటల భూమిలో రంగనాయక సాగర్ కాల్వ కోసం 1.16 ఎకరాల భూమి తీసుకున్నరు. మిగిలిన ఐదు ఎకరాల్లో కేవలం రెండు ఎకరాలకు మాత్రమే రైతుబంధు పైసలిచ్చిన్రు. మిగిలిన మూడెకరాల రైతుబంధు పైసలెవ్వి అని అడిగితే ఆన్ లైన్ లో భూమి వివరాలు లెవ్వంటున్నరు. అసలే కాల్వకు భూమి ఇచ్చి నష్టపోతే ఇప్పుడు ఆఫీసర్లు చేసిన తప్పులకు నాకు రైతుబంధు అందుతలేదు.

– ఎ.సత్యనారాయణ, మగ్దుంపూర్‌‌‌‌, సిద్దిపేట

 వచ్చే ఎండాకాలం వస్తయంట

నాకు సర్వే నంబర్ 316లో మూడు ఎకరాల 12గుంటల వ్యవసాయ భూమి ఉంది. సాగర్ భూముల కన్ఫర్మేషన్ కోసం చేపట్టిన సర్వేలో సాగర్ కాలువ కింద 12 గుంటల భూమి పోయింది. దీంతో సర్వే నంబరు 316 ను రెవెన్యూ అధికారులు హోల్డ్ లోఉంచారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతుబంధు కోల్పోయాను. ఆఫీసర్లకు ఫిర్యాదుచేస్తే వచ్చే ఎండాకాలం పంటల సీజన్లో రైతుబంధు డబ్బులు వస్తాయని చెబుతున్నారు.
    – కల్యాణపు వెంకటేశ్వరరావు, పడమరలోకవరం గ్రామ సర్పంచ్, కల్లూరు మండలం

చచ్చిపోయినా సాయం అందలే..
నాగర్ క‌ర్నూల్ జ‌ల్లా వట్టెం గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాగి మోహన్ రెడ్డికి ఉన్న 5 ఎకరాలు వట్టెం రిజర్వాయర్ లో పోయింది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు. ఈ లోపే రెవెన్యూ ఆఫీసర్లు ఆయన భూమిని బ్లాక్ చేశారు. దీంతో మొదటి నుంచీ రైతుబంధు రావడం లేదు. ఈ లోపే గుండెపోటుతో రాగిమోహన్ రెడ్డి చనిపోయారు. బాధిత కుటుంబానికి రైతుబందే కాదు, రైతుబీమా కూడా దక్కలేదు. పాలమూరు లిఫ్టు కింద భూములు కోల్పోయి పరిహారం అందక, ఉన్న భూమి ఆన్ లైన్ లో లేక, రైతుబంధు వర్తించక నష్టపోతున్న రైతులు సుమారు వెయ్యి మంది దాకా ఉంటారని ఆఫీసర్లే చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం