టీ-ఫైబర్ కు ఆఫీసర్ల అడ్డుపుల్ల!..సీఎం ఆదేశించినా పట్టింపు లేదు.. సీఎస్ హెచ్చరికలూ బేఖాతరు

టీ-ఫైబర్ కు ఆఫీసర్ల అడ్డుపుల్ల!..సీఎం ఆదేశించినా పట్టింపు లేదు.. సీఎస్ హెచ్చరికలూ బేఖాతరు
  •     టీ ఫైబర్​యంత్రాంగం సంప్రదింపులు చేస్తున్నా డోంట్​ కేర్​
  •     కమీషన్ల మాయలో కొందరు అధికారులు..  ప్రైవేటోళ్లకే వత్తాసు
  •     39 వేల ఆఫీసుల్లో ఇప్పటికీ 5 వేల ఆఫీసులకే కనెక్షన్లు 
  •     టీఫైబర్​ నెట్​తో సర్కార్​కు వందల కోట్లు ఆదా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ డిజిటల్ నెట్‌‌వర్క్‌‌ విస్తరించి, సర్కారు ఖజానాపై పడుతున్న వందల కోట్ల భారాన్ని తప్పించేందుకు తెచ్చిన ‘టీ–ఫైబర్’ ప్రాజెక్టును కొందరు ఉన్నతాధికారులే అటకెక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సెక్రటేరియెట్​నుంచి మొదలుకొని పల్లెల్లోని పంచాయతీ ఆఫీసుల దాకా అన్ని సర్కారు విభాగాల్లో తప్పనిసరి టీ–ఫైబర్ నెట్‌‌నే వాడాలని ప్రభుత్వం ఏడాదిన్నర కిందటే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. 

ఆ తర్వాత  సీఎం రేవంత్​రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్​సంజయ్​జాజు సైతం రంగంలోకి దిగి, ఈ సెప్టెంబర్​ నాటికి వంద శాతం టీ-ఫైబర్‌‌లోకి మారాల్సిందేనని, ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు ఒక్క పైసా బిల్లు కూడా చెల్లించవద్దని నెల రోజుల కింద  హుకుం జారీ చేశారు. టీ ఫైబర్​యంత్రాంగం కూడా అందుకు సిద్ధమై అన్ని ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ వివిధ శాఖల అధిపతులు (హెచ్​వోడీలు), కింది స్థాయి అధికారులు ఇవేమీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 39 వేలకు పైగా ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు టీ–ఫైబర్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 5 వేల ఆఫీసుల్లోనే ఇవ్వడం గమనార్హం. కేబినెట్ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నా, పలువురు అధికారులు మాత్రం ‘డోంట్ కేర్’ అంటూ పాత ప్రైవేట్ కనెక్షన్లనే కొనసాగిస్తుండడం వెనుక భారీ మతలబు నడుస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

టెలీకాం దిగ్గజాలకు భారీ దెబ్బ..

సర్కారు కార్యాలయాలన్నీ టీ–ఫైబర్ గ్రిడ్ పరిధిలోకి వస్తే ప్రైవేట్ టెలికాం, ప్రైవేట్​టెలికాం దిగ్గజాలకు భారీ దెబ్బ తగలడం ఖాయం. ఇప్పటివరకు రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఈ ప్రైవేట్ ప్రొవైడర్లు నెలనెలా కోట్లాది రూపాయల బిల్లులను  జేబుల్లో వేసుకుంటున్నారు. ఉదాహరణకు ఇప్పటివరకు ఇచ్చిన 5 వేలకు పైగా ఆఫీసుల నుంచి గతంలో ప్రైవేట్ నెట్‌‌వర్క్ కోసం రూ.41.64 కోట్లు ఖర్చు కాగా, టీ-ఫైబర్ ద్వారా కేవలం రూ.25.54 కోట్లకే నాణ్యమైన కనెక్టివిటీ లభించింది. ఉదాహరణకు ఇటీవల సెక్రటేరియేట్​ను టీఫైబర్​ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో ప్రైవేట్​ఆపరేటర్​కు ఏడాదికి రూ.14 కోట్లు చెల్లించేవారు. ఇప్పుడు టీ ఫైబర్​ పరిధిలో రూ.88 లక్షలే ఖర్చు అవుతుంది. మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా వంద శాతం టీ-ఫైబర్‌‌కు మారితే ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యే అవకాశముంది. 

ప్రభుత్వమే సొంతంగా నెట్‌‌వర్క్ ఏర్పాటు చేసుకుని తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ ఇస్తే.. ప్రైవేట్ కంపెనీలకు ఆ భారీ రాబడి శాశ్వతంగా ఆగిపోతుంది. అందుకే తమ వ్యాపారం పోకుండా ఉండేందుకు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా రంగంలోకి దిగి.. కొందరు కీలక అధికారులు, హెచ్‌‌వోడీలకు నెలవారీ ముడుపులు, కమీషన్ల ఎర వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ముడుపుల మత్తులో పడే అధికారులు టీ–ఫైబర్ కనెక్షన్లు తీసుకోకుండా కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తున్నది. ‘స్పీడ్ రావట్లేదు, సర్వర్ డౌన్ అవుతోంది’ అంటూ సాకులు వెతుకుతూ ఫైళ్లను తొక్కిపెడుతున్నారు. ప్రభుత్వానికి మేలు చేసే సొంత వ్యవస్థను కాదని, ప్రైవేట్ సంస్థల జేబులు నింపేందుకు అధికారులు ఇంతలా దిగజారడంపై సచివాలయ వర్గాల్లోనే తీవ్ర చర్చ నడుస్తున్నది.

ఆర్థికంగా, పాలనపరంగా ఎనలేని ప్రయోజనాలు.. 

నిజానికి టీ–ఫైబర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సర్కారుకు ఆర్థికంగా, పరిపాలనాపరంగా ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైవేట్ కంపెనీలకు ప్రతినెలా చెల్లిస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనం మిగలడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌‌సీలు, రైతు వేదికలు, సర్కారు బడులు, పోలీస్ స్టేషన్లకు 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్‌‌తో హై-ఎండ్ కనెక్టివిటీ అందుతుంది. దీనివల్ల ధరణి, ఈ-పంచాయతీ, టెలి-మెడిసిన్ వంటి డిజిటల్ సేవలు సర్వర్ సమస్యలు లేకుండా పల్లెల్లోని పేదలకు వేగంగా అందుతాయి. ముఖ్యంగా డేటా భద్రత పరంగా థర్డ్ పార్టీ ప్రైవేట్ సర్వర్లపై ఆధారపడే రిస్క్ తప్పుతుంది. పాత టీ-స్వాన్ వ్యవస్థను టీ-ఫైబర్‌‌లోకి మార్చడం ద్వారా ప్రభుత్వ సమాచార మార్పిడి అత్యంత పకడ్బందీగా మారుతుంది.  

ప్రతి గడపకూ డిజిటల్​ప్రయోజనాలు.. 

టీ-ఫైబర్‌‌తో కేవలం ప్రభుత్వ ఆఫీసులకే కాకుండా.. సామాన్య ప్రజలకు, ప్రతి గడపకూ ఊహించని రీతిలో డిజిటల్ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రతి ఇంటి నుంచే ‘మీసేవ’ తరహా ఆన్‌‌లైన్ సర్కారు సేవలను ప్రజలు నేరుగా పొందే అవకాశం దక్కుతుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల దరఖాస్తుల వరకు దళారులను ఆశ్రయించకుండా, మీసేవా కేంద్రాల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడకుండా ఇంట్లో కూర్చునే క్షణాల్లో పనులు పూర్తి చేసుకోవచ్చు. 

దీనికితోడు ప్రస్తుతం మార్కెట్లో టాటా స్కై (టాటా ప్లే), ఎయిర్‌‌టెల్ వంటి ప్రైవేట్ డీటీహెచ్ నెట్‌‌వర్క్‌‌లు, కేబుల్ ఆపరేటర్లు నెలకు వేల రూపాయల రీఛార్జ్‌‌లతో జనాన్ని పిండేస్తుండగా.. టీ-ఫైబర్ వీటన్నింటికీ ఒకే దెబ్బతో చెక్ పెట్టనుంది. టీ–ఫైబర్ అందించే సరికొత్త ‘స్మార్ట్ సెట్‌‌–టాప్ బాక్స్‌‌’తో ఇకపై ప్రైవేట్ డీటీహెచ్ డబ్బాల అవసరమే ఉండదు. ఒకే ఒక్క కనెక్షన్‌‌తో అపరిమిత హై-స్పీడ్ ఇంటర్నెట్‌‌తో పాటు వందలాది లైవ్ టీవీ ఛానెళ్లు, ఓటీటీలు, ప్రభుత్వ సమాచార సేవలు నేరుగా టీవీ స్క్రీన్‌‌పైకే అందుబాటులోకి వస్తాయి. ప్రైవేట్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ అత్యంత తక్కువ ఖర్చుతో ‘ట్రిపుల్ ప్లే’ (నెట్, టీవీ ఛానెల్స్, ప్రభుత్వ ఆన్‌‌లైన్ సేవలు) సామాన్యుడి గడప తొక్కే అవకాశమున్నా..  కొందరు అధికారుల స్వార్థం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. 

ఇప్పటివరకు విభాగాల వారీగా ఇలా.. 

విభాగాల వారీగా టీ-ఫైబర్ పురోగతిని పరిశీలిస్తే ఐటీ, ఆర్థిక విభాగాలు  ముందువరుసలో ఉన్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్స్ శాఖ అత్యధికంగా 95.5 శాతం  కార్యాలయాలను టీ-ఫైబర్‌‌కు అనుసంధానించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆర్థికశాఖ 87.8 శాతం  మైగ్రేషన్‌‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. పాఠశాల విద్య విభాగం ఏకంగా 2,691 ఆఫీసులను 77.8 శాతం అనుసంధానించింది.   వ్యవసాయం, సహకార శాఖ పరిధిలోని 2,075 ఆఫీసుల్లో 1,586 కార్యాలయాలు 76.4 శాతం టీ-ఫైబర్‌‌కు మారాయి. సాధారణ పరిపాలన శాఖ 59.7 శాతం, న్యాయశాఖ 50 శాతం, పరిశ్రమలు–వాణిజ్య శాఖ 49.8 శాతం పూర్తి చేసుకున్నాయి. 

ఇరిగేషన్ శాఖ 17.6 శాతం, ఆర్ అండ్ బీ 10.1 శాతంతో పది శాతం మార్కును దాటగా, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ (ఏంఎయూడీ) పరిధిలోని  7.2 శాతం మాత్రమే టీ-ఫైబర్ పరిధిలోకి వచ్చాయి. రాష్ట్రంలో అత్యధికంగా 11,358 ఆఫీసులు కలిగిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇప్పటివరకు  0.7 శాతం మాత్రమే మారగా, ఇంకా 11,276 ఆఫీసులు ప్రైవేట్ నెట్‌‌వర్క్‌‌లోనే కొనసాగుతున్నాయి. అలాగే 7,227 కార్యాలయాలున్న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో కేవలం  0.2 శాతం, 4,520 ఆఫీసులున్న విద్యుత్ శాఖలో కేవలం, ఉన్నత విద్యాశాఖ మాత్రమే టీ-ఫైబర్‌‌లోకి మారాయి. పోలీసు స్టేషన్లు ఉండే హోంశాఖ 1.1 శాతం, రెవెన్యూ 0.9 శాతం, ఎస్సీ సంక్షేమం 0.1 శాతం, గిరిజన సంక్షేమం (0.1శాతం) శాఖల్లో అనుసంధానం ఒక శాతం లోపే ఉంది.