
- మంత్రి ఆదేశించారు..ఆఫీసర్లు ఇచ్చేశారు
- సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల నిర్మాణానికి ‘మినరల్’ ఫండ్స్
- రూల్స్‌కు వ్యతిరేకంగా కేటాయింపు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి
- ఒక్కో నేత ఇంటికి రూ.5.04 లక్షల చొప్పున రూ.2.11 కోట్లు
- లబ్ధిపొందిన చాలా మందికి భూములు, సొంత ఇండ్లు
సూర్యాపేట, వెలుగు: డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధులు దారి మళ్లాయి. గనులు, పరిశ్రమల నుంచి సీనరేజ్ రూపంలో వస్తున్న మినరల్ ఫండ్స్‌ను.. ఆయా సంస్థల వల్ల ప్రభావితమయ్యే ఏరియాల్లో అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రూల్స్‌కు వ్యతిరేకంగా సూర్యాపేట నియోజకవర్గంలో 42 మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రూ. 5.04 లక్షల చొప్పున ఈ నిధులను కేటాయించారు. ఆర్టీఐ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్డగోలుగా మంజూరు
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ సూర్యాపేటకు చెందిన బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం అడ్డగోలుగా ఇండ్లు మంజూరు చేసి, వాటిని కట్టుకోవడానికి మినరల్ ఫండ్స్ కేటాయించారు. ఈ ఫండ్స్పొందిన వారిలో సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, లీడర్ల అనుచరులు ఉన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో అధికారులు డీఎంఎఫ్‌టీ ఫండ్స్ కేటాయించారు. ఒక్కో లీడర్ ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షల చొప్పున మొత్తం రూ.2.11 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్) మండలంలో 14 మందికి, సూర్యాపేట మండలంలో 11 మందికి, పెన్ పహాడ్ మండలంలో 12 మందికి, చివ్వెంల మండలంలో 10 మంది బీఆర్ఎస్ నాయకులకు ఫండ్స్ కేటాయించారు. లబ్ధిపొందిన వారిలో చాలా మందికి భూములు, సొంత ఇండ్లు ఉండటం గమనార్హం.
రూల్స్ బేఖాతర్
డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టుకు 2018 కంటే ముందు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండేవారు. 70 శాతం నిధులు ప్రభావిత ప్రాంతాల్లో, మిగతా 30 శాతం జిల్లాలో వినియోగించాలనే రూల్ఉండేది. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జిల్లా మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలకు 40 శాతం, జిల్లాలో 60 శాతం ఫండ్స్ వినియోగించాలని కొత్తగా జీవో రిలీజ్చేశారు. ఈ ఫండ్స్‌ను మైనింగ్ ప్రభావిత గ్రామాల్లో విద్య, వైద్యం, వాటర్, రోడ్లకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు వాడరాదని జీవోలో పేర్కొన్నా.. లీడర్లు ఖాతరు చేయడంలేదు. మంత్రి సూచించిన పనులకు.. టెండర్లు లేకుండానే, రూల్స్ పాటించకుండానే ఇష్టమొచ్చినట్టు ఫండ్స్ కేటాయిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు ఈ నిధులు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా సొంత పార్టీ లీడర్ల కోసం అన్ని రూల్స్ పక్కనపెట్టారు. నిజానికి సూర్యాపేట నియోజకవర్గంలో వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకుని ఏండ్లుగా ఇండ్ల కోసం ఎండ్లుగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గానికి 1,900 ఇండ్లు మంజూరు కాగా కేవలం 375 మందికి మాత్రమే కేటాయించారు. గత ఏడాది డిసెంబర్‌లో 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
కలెక్టర్ ఆదేశాలతోనే
డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌తో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో టెండర్లు పిలిచాం. ఇప్పటి వరకు 25 ఇండ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాం. మరో 16 ఇండ్ల నిర్మాణానికి ఎవరూ టెండర్లు వేయలేదు. మరోసారి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
- యాకూబ్,
ఆర్అండ్బీ ఈఈ, సూర్యాపేట