గ్రేటర్ వరంగల్లో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలకు చెక్!..

గ్రేటర్ వరంగల్లో  ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలకు చెక్!..
  •  గ్రేటర్‍ వరంగల్‍ ట్రాఫిక్‍, యాక్సిడెంట్లకు కారణాలు గుర్తించిన పోలీసులు
  •   పరిష్కార మార్గాల కోసం సిబ్బందితో.. పోలీస్‍, బల్దియా కమిషనర్ల రివ్యూ 
  •   పోలీస్‍, మున్సిపల్‍ శాఖల సిబ్బంది కలిసి పనిచేయాలని నిర్ణయం 
  •   ఇరు శాఖలకు సవాల్‍గా మారనున్న పార్కింగ్‍ సమస్య 

వరంగల్‍, వెలుగు : గ్రేటర్ వరంగల్​లో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వరంగల్​నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్‍ సమస్య, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో పోలీస్‍ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు రెడీ అవుతున్నారు. ట్రై సిటీ పరిధిలో ఉండే వరంగల్‍, హనుమకొండ, కాజీపేట నగరాల్లో ట్రాఫిక్‍ సమస్యకు ప్రధాన కారణాలేంటో అధ్యయనం చేశారు. ట్రాఫిక్‍ ఇబ్బందుల పరిష్కారానికి ఎక్కువ చొరవ చూపాల్సిన బాధ్యత జీడబ్ల్యూఎంసీపై ఉందని భావించారు.  

ట్రాఫిక్‍ సమస్యపై రివ్యూ..

నగరంలో ట్రాఫిక్​సమస్య పెరుగుతున్న నేపథ్యంలో అసలు సమస్యలేంటో తెలుసుకున్న వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ వెంటనే గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍తో మాట్లాడారు. మున్సిపల్‍ శాఖ ప్రధాన అధికారులు, ట్రాఫిక్‍ అడిషనల్‍ డీసీపీ మొదలు సీఐల వరకు పోలీస్‍ కమిషనరేట్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుని సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్‍ శాఖ ట్రైసిటీ పరిధిలో గుర్తించిన ప్రధాన సమస్యలను అడిషనల్‍ డీసీపీ ప్రభాకర్‍రావు వివరించారు. 

సిటీలో ‘సెల్లార్‍ పార్కింగ్‍’ ఉత్తిమాటే..

గ్రేటర్ వరంగల్​లో ట్రాఫిక్‍ సమస్యలకు ప్రధాన కారణాలేంటో అధ్యయనం చేసిన క్రమంలో ప్రధానంగా ఫుట్‍పాత్‍లు, రోడ్ల ఆక్రమణతోపాటు సెల్లార్‍ పార్కింగ్‍ సిస్టం లేకపోవడాన్ని గుర్తించారు. దాదాపు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే వరంగల్‍, హనుమకొండ, కాజీపేట నగరాల్లో మెయిన్‍ రోడ్లవెంట వేలాది షాపింగ్‍ మాల్స్, ఆస్పత్రులు, బ్రాండెడ్‍ షోరూమ్స్, హోటల్స్, బార్‍ అండ్‍ రెస్టారెంట్లు, వెహికల్‍ షోరూమ్స్, ఇనిస్టిట్యూషన్లు, ఫంక్షన్‍హాల్స్, బ్యాంకులు ఉన్నాయి.

 ఇందులో సెల్లార్‍ పార్కింగ్‍ నిర్వహిస్తున్నవి ఒక్క శాతం కూడా లేవు. నిబంధనలకు విరుద్ధంగా మెజార్టీ సెల్లార్లను పార్కింగ్‍ కోసం కాకుండా వ్యాపారాలు, స్టోర్‍ రూంలు, హాస్పిటల్ ల్యాబ్స్ నిర్వహణకే వినియోగిస్తున్నారు. ఇవి చాలావన్నట్లుగా.. బైక్‍ షోరూమ్స్ వంటి కమర్షియల్‍ బిజినెస్‍ వ్యాపారులు తమ కొత్త వాహనాలను ఏకంగా ఫుట్‍పాత్‍ పై నింపేస్తున్నారు. చిరువ్యాపారుల ముసుగులో కొందరు మెయిన్‍ రోడ్లను ఆక్రమించి బడా వ్యాపారం చేస్తున్నారు. 

ట్రాఫిక్‍ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు దాదాపు 80 శాతం ఈ రెండే కారణమవుతున్నా.. అధికారులు ఏనాడూ వీటిపై చర్యలు తీసుకోలేదు. ఈసారి మాత్రం పోలీస్‍, మున్సిపల్‍ శాఖల కమిషనర్లు కలిసి రివ్యూ చేయడం.. రోడ్ల ఆక్రమణలు, సెల్లార్‍ పార్కింగ్‍పై సీరియస్‍గా ఉంటామని చెప్పారు. కాగా, చర్యల అమలు విషయంలో రెండు శాఖల అధికారులు ఎలా పనిచేస్తారోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

గ్రేటర్‍ వరంగల్లో.. ట్రాఫిక్‍ కష్టాలకు కారణాలివే..

  • ట్రైసిటీ అంతటా పెరిగిన ఫుట్‍పాత్‍లు, రోడ్లపై ఆక్రమణలు 
  •  సిటీకి అనుగుణంగా సెంటర్లలో పార్కింగ్‍ స్థలాలు లేవ్‍ 
  •   షాపింగ్‍ మాల్స్‍, కాంప్లెక్సుల్లో సెల్లార్‍ పార్కింగ్‍ లేకపోవడం 
  •   మెయిన్‍ రోడ్లలో డివైడర్లు తక్కువ ఎత్తులో ఉండడం 
  •   వ్యాపార సైన్‍బోర్డులు ఇష్టారీతిన అడ్డుగా ఏర్పాటు చేయడం 
  •   అడ్డుగా వినియోగంలోలేని కరెంట్‍, టెలిఫోన్‍ స్తంభాలు  
  •  ప్రధానరోడ్లపై పెరిగిన గుంతలు, రోడ్లపై నిలుస్తున్న వరదనీరు 
  •  వడ్డెపల్లి చర్చి, కాళోజీ సెంటర్‍, నర్సంపేట రోడ్‍ తెలంగాణ జంక్షన్‍, పెద్దమ్మగడ్డ జంక్షన్‍, నాయుడు పెట్రోల్‍ బంక్‍ ఆర్టీఏ జంక్షన్‍, మడికొండ చౌరస్తాలో కొత్త ట్రాఫిక్‍ సిగ్నల్స్‍ ఏర్పాటు