ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతు బీమా రాకుంటే అధికారులదే బాధ్యత
ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని, బాధిత రైతులకు రైతు బీమా అందకుంటే అధికారుదే బాధ్యత అని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. ఎంపీపీ కల్లూరు అనిత శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం రాయపోల్​ మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సర్పంచులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ అకౌంట్లను ప్రీజింగ్​లో పెట్టడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ సర్పంచ్​ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, నిధుల విడుదల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల పరిధిలో 76 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పెండింగ్​లో ఉన్నాయని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని వెంటనే కాంట్రాక్టర్లు పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. మండలంలో 18 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాత్కాలికంగా ముంపు గ్రామాల్లోని టీచర్లను బదిలీ చేయాలని డీఈవోకు ఎమ్మెల్యే సూచించారు. డబుల్​ బెడ్​రూమ్​ఇండ్ల పనులను సక్రమంగా పని చేయని కాంట్రాక్లర్లను తొలగించి కొత్తవారికి అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, ఎంపీడీవో మున్నయ్య, తహసీల్దార్​సందీప్​ పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు కాదు.. 
బడి పిల్లలకు బట్టలివ్వండి

నారాయణ్ ఖేడ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిల్లలకు బట్టలు ఇచ్చి, ఆ తర్వాత ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నారాయణఖేడ్  మండల పరిధిలోని ఆయా పట్టణల్లో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, రవికుమార్ గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడారు. 
టీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం పూర్తిగా 

అస్తవ్యస్తంగా తయారైందన్నారు సంక్షేమ హాస్టల్​లో టీచర్ల కొరత, స్టూడెంట్స్ కు  ఫుడ్​ క్వాలిటీగా పెట్టడం లేదని  తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, నియామకాలు చేపట్టక పోవడంతో యువకులు ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మారుతి రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు విజయ్ షెట్కార్, నాయకులు పాల్గొన్నారు.  

రసాభాసగా అందోలు-జోగిపేట మున్సిపల్‌‌‌‌‌‌‌‌ సమావేశం 

జోగిపేట, వెలుగు : అందోలు–జోగిపేట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.  గురువారం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మల్లయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై చర్చ జరగకుండానే ఆమోదిస్తున్నట్లు వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై కొద్దిసేపు వాగ్వావాదం జరిగింది. వినాయక నిమజ్జనం కోసం చెరువు వద్ద ఏర్పాట్లకు సంబంధించి రూ.2 లక్షలు ఆమోదానికి పెట్టడంతో చెరువు వద్ద ఏర్పాట్లేమీ చేయలేదని సభ్యులు అబ్జెక్షన్​ చెప్పారు. బతుకమ్మ పండుగకు రూ.2 లక్షలు, దసరా ఏర్పాట్లకు రూ.2 లక్షలు అంచనా వ్యయంపై కూడా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రతి వార్డుకు రూ.2 లక్షలను జనరల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ను కేటాయిచడంపై సభ్యులు ఆమోదం తెలిపారు. 

బిల్లులు ఆపిందెవరో చెప్పండి 

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పదే పదే చెబుతున్నా అధికార పార్టీ నాయకులు, చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించకపోవడమేనా అభివృద్ధి అని చైర్మన్​ను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ చిట్టిబాబు ప్రశ్నించారు. బిల్లుల రికార్డు చేయకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో పక్క గదిలో ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ల భర్తలు, తనయులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చి కుర్చీలను పడేశారు. వారంతా లోనికి వచ్చినా అధికారులు చూస్తూ ఉండిపోవడం గమన్హారం. ఈ విషయంపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయారు. 

పోడుభూములపై మంత్రి సమీక్ష

మెదక్​ టౌన్, వెలుగు : ఎన్నో ఏళ్లుగా పోడు  భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని వారికి  న్యాయం చేసేందుకు, అడవుల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. గురువారం మెదక్​ కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో  ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 85 గ్రామాలలో  7,740 ఎకరాలకు  సంబంధించి 4,503  క్లెయిమ్స్​ స్వీకరించి ఆన్​లైన్​లో పొందుపర్చామని వివరించారు. అయితే 85 గ్రామ పంచాయతీల్లోని 140  హ్యాబిటేషన్లలో 4,606 ఎకరాలకు సంబంధించి 2,776  క్లెయిమ్స్​ సకాలంలో వచ్చిన ఆన్ లైన్ గ్రామ వివరాలు కనిపించక పొందుపర్చలేకపోయారన్నారు. దీనికి సంబంధించి సమగ్ర వివరాలు మండలాల వారీగా ఎంపీడీవోలకు అందించాలని అటవీ శాఖ అధికారికి సూచించారు. 

 రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీశాఖలు సమన్వయం  చేసుకుంటూ ఎంపీడీవోలు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 2005 కంటే ముందు నుంచి  అన్యాక్రాంతంగా  పోడు  భూములు  సాగు చేస్తున్న  గిరిజనులను, మూడు తరాలుగా 75 సంవత్సరాల నుండి పోడు భూములను సాగుచేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్స్​లను  గ్రామ స్థాయి కమిటీలో  క్లెయిమ్​దారుల సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే  చేపట్టాలన్నారు.  ఆయా స్థాయి కమిటీలో తీర్మాణాలను రిజిస్టర్లును పక్కాగా నమోదు చేయాలన్నారు. అధికారులుగా త్వరగా పోడు  భూములను సర్వే చేసి గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ చైర్​పర్సన్​ హేమలత శేఖర్​గౌడ్,  ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్​రెడ్డి, మదన్​రెడ్డి,  జిల్లా కలెక్టర్ హరీష్,  అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

జడ్పీ భవనంలో మొదటి ఫ్లోర్​ ప్రారంభం 


మెదక్​ పట్టణంలోని జడ్పీ పరిషత్ భవనం మొదటి ఫ్లోర్​ను మంత్రి గురువారం ప్రారంభించారు. దీనిని సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా నిర్మించారు.  అంతకుముందు మెదక్​నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం నాగ్సాన్​పల్లికి చెందిన వంద మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మెదక్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మంత్రి సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు.

సమాచారం లేకుండా సమావేశానికి వస్తే ఎలా?

మెదక్, వెలుగు : ‘నువ్వేం డీఈవో వయా బాబు... నీకు సమాచారం తెల్వకుంటే... ఇగ ఎమ్మెల్యేలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఏం చెబుతావు.. సమాచారం లేకుండా సమావేశానికి వస్తే ఎలా’.. అని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు డీఈవో రమేశ్​కుమార్ పై మండిపడ్డారు. గురువారం మెదక్​ కలెక్టరేట్​లో జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత అధ్యక్షతన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. విద్యాశాఖపై చర్చ సందర్భంగా ‘మన ఊరు - మన బడి’ కింద జిల్లాలో ఎన్ని స్కూళ్లు సెలెక్ట్​ అయ్యాయి? మొత్తం ఎన్ని ఫండ్స్​ మంజూరయ్యాయి? అని డీఈవోను మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. ఆయన దానికి సరైన సమాచారం ఇవ్వకుండా తడబడటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత జిల్లాలో మొత్తం 313 స్కూళ్లు సెలెక్ట్​ కాగా, 209 స్కూళ్లలో పనులు స్టార్ట్​ అయ్యాయని డీఈవో తెలిపారు. మిగతా స్కూళ్లలో పనులు ఎందుకు జరగడం లేదు? టెండర్లు ఎందుకు లేట్​అవుతున్నాయని మంత్రి ప్రశ్నించారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‘మీరు ఆఫీస్​లో తక్కువ ఉండండి.. ఫీల్డ్ మీద ఎక్కువ తిరగండి.. రోజూ నాలుగు స్కూళ్లు విజిట్​ చేయండి’ అని డీఈవోను ఆదేశించారు. జిల్లాలో పనులు ఆలస్యంగా జరుగుతున్నందున ఇక నుంచి ప్రతి సోమవారం ‘మన ఊరు మన బడి’ పనుల ప్రగతిపై రివ్యూ చేయాలని లోకల్​ బాడీ అడిషనల్​కలెక్టర్​ ప్రతిమాసింగ్​ కు సూచించారు. పనులు స్పీడ్ గా జరిగేలా చూడాలన్నారు. 

ఫండ్స్​ లేక పాట్లు.. 

కొత్త మండలాల్లో ఫండ్స్​ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, ఫర్నీచర్​ లేదని,  ఆఫీసుల కిరాయి కట్టడానికి తిప్పలు తప్పడం లేదని చిలప్​ చెడ్, నార్సింగి ఎంపీపీలు వినోద, సబిత ప్రస్తావించారు. దీనికి మంత్రి స్పందిస్తూ కొత్త మండలాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్​హరీశ్​ కు సూచించారు. 

ధాన్యం ట్రాన్స్​పోర్టుకు ఇబ్బంది


జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి అన్నారు. గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమవుతున్నాయి? ఎన్ని వస్తున్నాయి?  డ్యామేజీ బ్యాగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైస్​ మిల్లుల అలాట్​మెంట్ ​సరిగా లేదని, కొనుగోలు సెంటర్లకు సమీపంలో ఉన్న  రైస్​ మిల్లులు కాకుండా దూరంలో ఉన్న మిల్లులను అలాట్​ చేయడంతో ట్రాన్స్​పోర్ట్​కు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

పీహెచ్​సీలో సేవలు అందట్లే.. 

పాపన్నపేట పీహెచ్​సీలో డెలివరీలు ఎక్కువగా అవుతున్నా, సరిపడినంత మంది స్టాఫ్​ లేక మెదక్ ఆసుపత్రికి రెపర్​ చేస్తున్నారని ఎంపీపీ చందన తెలిపారు. పెద్దశంకరంపేట పీహెచ్​సీ డాక్టర్​ డ్యూటీకి సరిగా రావడంలేదని, మండల జనరల్ బాడీ మీటింగ్​ఈకు కూడా హాజరుకావడం లేదని ఎంపీపీ శ్రీనివాస్​ అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిజాంపేట జడ్పీటీసీ విజయ్​ కుమార్ ప్రశ్నించారు. మెదక్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్​ కేర్​ యూనిట్​ కోసం రూ.23 కోట్లు మంజూరు చేసినందుకు, బీసీ వుమెన్స్​ రెసిడెన్సియల్​ డిగ్రీ కాలేజీ మంజూరు చేసినందుకు మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి మంత్రి హరీశ్​ రావ్​కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్, అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్ పాల్గొన్నారు. 

కేసీఆర్ పాలనతో గ్రామాలు అభివృద్ధి 

కొమురవెల్లి, వెలుగు:  సీఎం కేసీఆర్ పాలనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమైందని రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ అన్నారు. గురువారం కొమురవెల్లి మండలంలోని రసూలాబాద్ లో ఆయన ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు ఖాజాబీ, రాములు, శ్రవణ్ , సునీత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కొమురవెల్లి, వెలుగు: గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కిష్టంపేట గ్రామ సర్పంచ్ భీమనపల్లి కర్ణాకర్ సూచించారు. గురువారం కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు సహజ సిద్ధంగా దొరికే పండ్లు తినాలని సూచించారు.  ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం పిల్లలకు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళీ కృష్ణ, స్కూల్ హెచ్ఎం తుకారాం, అంగన్వాడీ టీచర్ ఆకుల రేణుక, ఏఎన్ఎం లీల, ఆయాలు, డీలర్లు, గర్భిణులు, పిల్లలు పాల్గొన్నారు.

అనుమతి లేని ఆస్పత్రులు సీజ్

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ లో  అనుమతి తీసుకోకుండా నడుపుతున్న ఆసుపత్రులను గురువారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.గాయత్రీదేవి సీజ్ చేశారు.  పట్టణంలోని స్పర్శ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్, సిద్ధి హాస్పిటల్,  యుద్ధ డయాగ్నస్టిక్ సెంటర్​ ను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.


ఐలమ్మ సభను సక్సెస్​ చేద్దాం

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు మండల పరిధిలోని చిట్కుల్​ గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని    మంత్రి కేటీఆర్, తదితర సర్పంచ్, టీఆర్​ఎస్​ రాష్ట్ర యువ నాయకులు నీలం మధు తెలిపారు.  గురువారం నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. కేటీఆర్​ పర్యటన సందర్భంగా  30 వేల  మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  జన సమీకరణ లో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కృషి చేయాలని సూచించారు.