కబ్జా భూముల స్వాధీనంపై అధికారులు సైలెంట్.. పట్టాల కోసం పిటిషన్

కబ్జా భూముల స్వాధీనంపై అధికారులు సైలెంట్.. పట్టాల కోసం పిటిషన్

మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​ మండలం లంబడిపల్లెలో కబ్జాకు గురైన సెరీకల్చర్​ భూములపై అధికారులు సర్వేలతోనే సరిపెడుతున్నారు. కబ్జా చేశామని కబ్జాదారులే ఒప్పుకుంటున్నా అధికారులు యాక్షన్​ తీసుకోవడం లేదు. దీంతో కబ్జాదారులు కొత్త వాదన ముందుకు తెస్తున్నారు. ఎప్పుడో 30 ఏండ్ల కిందట సింగరేణిలో పోయిన భూములకు బదులుగా కబ్జా భూములకు పట్టాలు ఇయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు. రూలింగ్​ పార్టీ లీడ కబ్జాదారులకే భూములను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

100 ఎకరాలకు పైగా కబ్జా..... 

సెంట్రల్​ సిల్క్​ బోర్డు ఆధ్వర్యంలో చెన్నూర్​లో1982 సంవత్సరంలో ప్రభుత్వం దసిలిపట్టు గూళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పట్టుగూళ్ల ఉత్పత్తి కోసం లంబడిపల్లి, ఎల్లక్కపేట గ్రామ శివార్లలో సెరీకల్చర్​ డిపార్ట్​మెంట్​కు 306 ఎకరాలను కేటాయించింది. ఇందులో 90 ఎకరాలను సెంట్రల్​ సిల్క్​ బోర్డుకు, 206 ఎకరాలను స్టేట్​ సెరీకల్చర్​ డిపార్ట్​మెంట్​కు ఇచ్చింది. సర్వేనంబర్లు 1/5 నుంచి 1/13 వరకు, 318/12, 318/13లో మొత్తం 103.83 ఎకరాల భూములు ఉన్నాయి.

అలాగే సర్వేనంబర్లు 1284/13 నుంచి 1284/22 వరకు 84.19 ఎకరాల భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఈ భూముల్లో పట్టుగూళ్ల ఉత్పత్తి కోసం వేల సంఖ్యలో ఏరుమద్ది చెట్లను పెంచుతున్నారు. కొంతకాలంగా లంబడిపల్లికి చెందిన పలువురు ఏరుమద్ది ప్లాంటేషన్​ను నరికేసి భూములను కబ్జా చేస్తున్నారు. బ్లేడ్​ ట్రాక్టర్లతో సాఫ్​ చేసి పంటలు వేసుకుంటున్నారు.

లంబడిపల్లి, కిష్టంపేటకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సుమారు 100 ఎకరాలను ఆక్రమించుకున్నారు. సెంట్రల్​ సిల్క్​ బోర్డు భూముల్లో లంబడిపల్లికి చెందిన ఒక స్థానిక ప్రజాప్రతినిధి, కిష్టంపేటకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మామిడితోటలు పెట్టారు. కబ్జా అయిన ఈ భూముల విలువ రూ.30 కోట్ల పైమాటేనని స్థానికులు చెప్తున్నారు. 

స్పందించని అధికారులు.... 

సెరీకల్చర్​ భూముల కబ్జా విషయాన్ని చెన్నూర్​ పట్టుపరిశ్రమ శాఖ అధికారులు ఆ డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న కలెక్టర్​కు, చెన్నూర్​ తహసీల్దార్​కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. సర్వేచేసి హద్దులు పెడితే తాము ట్రెంచ్​లు కొట్టి భూములను కాపాడుకుంటామని తెలిపినా ఎలాంటి స్పందన లేదు. సర్వే చేయడానికి తమ వద్ద సిబ్బంది లేరని, ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారు.

ఈ విషయమై మార్చి 20న 'వెలుగు' పేపర్​లో న్యూస్​ రావడంతో ఉన్నతాధికారులు స్పందించి సర్వేకు ఆదేశించారు. నాలుగు రోజుల కిందట సెరీకల్చర్​ భూములను సర్వే చేస్తుండగా కబ్జారులు మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకోవడమే కాకుండా సిబ్బందిపై దాడికి దిగారు. దీనిపై సెరీకల్చర్​ అధికారులు రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. 

పట్టాలు కావాలని డిమాండ్​ 

కబ్జా చేసిన సెరీకల్చర్​ భూములను ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి కబ్జాదారులు వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. 1990 సంవత్సరంలో ఎల్లక్కపేటలో సింగరేణి కోల్​మైన్స్​ కోసం 29 కుటుంబాల నుంచి భూములు తీసుకున్నారు. వాటికి బదులుగా సెరీకల్చర్​ డిపార్ట్​మెంట్​కు చెందిన 1284/13 నుంచి 1284/22 వరకు గల సర్వేనంబర్లలో తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సోమవారం నాటి గ్రీవెన్స్​లో మెమోరాండం అందజేశారు.

మరోవైపు ఎలాగైనా ఈ భూములను దక్కించుకునేవాలని రూలింగ్​ పార్టీ లీడర్లు  ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కబ్జాదారులకే భూములు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అటు సెరీకల్చర్​ అధికారులు, ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తుండడంతో కోట్ల విలువైన భూములు కబ్జాదారుల పాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ భూములను కాపాడాలని కోరుతున్నారు. లేకుంటే తాము ఉపాధి కోల్పోతామని వాపోతున్నారు.