మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు

మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
  •     పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాలుగైదు రోజులుగా కసరత్తు
  •     పొదుపు చేసిన జలాల లెక్కలివ్వాలన్న సీడబ్ల్యూసీ

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మిగులు జలాల లెక్క తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మైనర్​ ఇరిగేషన్​లో భాగంగా తెలంగాణ వాటాగా ఉన్న జలాల్లో నుంచి పొదుపు చేసిన 45 టీఎంసీల జలాలపై కొద్ది రోజులుగా లెక్కలు తేలుస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ జలాల లెక్కలు తీసి ప్రాజెక్టు డీపీఆర్​ను ఆమోదించుకునేందుకు పనిలో పడ్డారు. 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్​ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సంగతి తెలిసిందే.

అందులో 45 టీఎంసీలను పొదుపు చేసిన నీటి ఆధారంగా లెక్కగట్టామని డీపీఆర్​లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ పొదుపు ఎక్కడి నుంచి చేశారో, ఎలా చేశారో చెప్పాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఇటీవల రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే నాలుగైదు రోజులుగా ఇరిగేషన్​ అధికారులు ఆ లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఆ రిపోర్టు ఆధారంగా సీడబ్ల్యూసీకి వివరాలు అందించి డీపీఆర్​ను ఓకే చేయించుకోవాలన్న యోచనలో ఉన్నారు. 

వివిధ ప్రాజెక్టుల మెయింటెనెన్స్​కు రూ.40 కోట్లు

వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రిపేర్లు, గేట్ల మెయింటెనెన్స్​కు రూ.40 కోట్ల మేర ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిసింది. ఆ నిధుల సర్దుబాటుపై సర్కారుకు ఇరిగేషన్​ అధికారులు నివేదించనున్నారు. ఫ్లడ్​ సీజన్​ వచ్చేలోగా ప్రాజెక్టులను పరిశీలించి రిపేర్లుంటే చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుడు వర్షాకాలంలో కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద రావడం, ఆ ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేదన్న విమర్శలు వచ్చాయి.