పైసలిచ్చుకో.. యూరియా ఇండెంట్ పెట్టుకో..!

పైసలిచ్చుకో.. యూరియా ఇండెంట్ పెట్టుకో..!
  • వ్యవసాయ శాఖలో అధికారుల వసూళ్ల దందా
  • జిల్లా ఆఫీసు నుంచి మండలం వరకు అదే తీరు 
  • అడిగినంత ఇస్తే సరి.. లేకుంటే ముప్పు తిప్పలు 
  • లబోదిబోమంటున్న ఫర్టిలైజర్స్ షాపుల డీలర్లు 
  • ఆత్మహత్యే శరణ్యమంటున్న నిర్వాహకులు

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని డీసీఎమ్మెస్, ప్యాక్స్, హాకా, ఆగ్రోస్ డీలర్లకు ఎరువుల సప్లైలో అగ్రికల్చర్ ఆఫీసర్లు వసూళ్ల దందాకు తెరలేపారు. ఫర్టిలైజర్స్ షాపుల లైసెన్సులు మొదలుకొని ఎరువుల అలాట్​మెంట్ వరకు అధికారుల చేయి తడపనిదే ఏ పనీ కావడం లేదంటున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీస్ నుంచి డివిజన్, మండలం, క్లస్టర్ వరకు అదే తంతు నడుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. షాపును బట్టి ఏటా రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని డీలర్లు వాపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఎంత అడిగితే అంత ఇండెంట్ పెడుతున్నారని, పైసలు ఇవ్వకపోతే రకరకాల సాకులు చెప్పి ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వాటాల పంపకాల్లో గొడవలు

ఫర్టిలైజర్స్ డీలర్ల దగ్గర వసూలు చేసిన ముడుపుల పంపకాల్లో తేడాలు రావడంతో అధికారులు, సిబ్బంది మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వానాకాలం సీజన్​లో ఇదే విషయమై కొంత మంది ఆఫీసులోనే గొడవ పడ్డ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఫర్టిలైజర్స్ సెక్షన్​లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో వారిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముడుపులు ఇచ్చిన డీలర్లు ఎరువులను అధిక ధరలకు అమ్మినా, పెద్ద ఎత్తున యూరియాను పక్కదారి పట్టించినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

చెన్నూర్​లో విచ్చలవిడిగా వసూళ్లు 

చెన్నూర్ మండలంలోని వ్యవసాయ అధికారులకు ఫర్టిలైజర్ డీలర్లు అడిగినంత లంచం ఇచ్చుకోవాలి. ఇంటికి రోజూ కూరగాయలతో పాటు ఆఫీసులో చాయ్​లు, సమోసాల ఖర్చలు భరించాలి. ఇలా ఆఫీసర్లకు  పర్సనల్ పనులు కూడా చేయాల్సిందే. ఫర్టిలైజర్ యజమానులు ఎదురుతిరుగలేక, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మ హత్యే శరణ్యం అంటున్నారంటే అధికారుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భారీగా ముడుపులు తీసుకొని చెన్నూర్ మండలంలోని ఓ గ్రామంలో హాకా సెంటర్  లైసెన్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 

ఆ షాప్​కు యూరియా ఇండెంట్ పెట్టడానికి కూడా లంచం డిమాండ్ చేసి నెలల తరబడి తిప్పుకున్నారని తెలిసింది. ప్రతిరోజు కూరగాయలు, స్వీట్స్, చాయ్, సమోసాలు ఆఫీసుకు తెమ్మంటున్నారని డీలర్ కుటుంబసభ్యులిద్దరు ప్రముఖ రాజకీయ నాయకులతో అగ్రికల్చర్ ఆఫీస్​కు వెళ్లి నిలదీశారు. వారి ముందే అధికారి దబాయించడంతో డీలర్ భార్య ఆత్మహత్య చేసుకుంటానని చెప్పగా నాయకులు యూరియా ఇండెంట్ పెట్టాలని మందలించినట్టు తెలిసింది.

 వాస్తవానికి ట్రాన్స్​పోర్ట్, హమాలీ చార్జితో పాటు ఒక బస్తా యూరియాకు రూ.260 సబ్సిడీతో డీలర్ షాపులో స్టాక్ దించాలి. కానీ చెన్నూర్​లో ఈ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని మండలంలోని ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారలు స్పందించి ఈ వసూళ్లను అరికట్టాలని కోరుతున్నారు.

ఒక్కో లోడ్​కు రూ.3 నుంచి రూ.5 వేలు 

మంచిర్యాల జిల్లాలో సుమారు 350 ఫర్టిలైజర్స్ డీలర్లున్నారు. వీరికి వానాకాలం, యాసంగి సీజన్లలో కావాల్సిన ఎరువుల కోసం వ్యవసాయ శాఖ ద్వారా ఇండెంట్ పెడుతారు. ఇదే అదునుగా అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు మొదలు జిల్లా ఆఫీసర్ల వరకు తమ స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూరియాకు రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అది కావాల్సిన డీలర్లు ఆఫీసర్లు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.

 లేదంటే ఇండెంట్ పెట్టడానికి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం, అవసరానికన్నా తక్కువ ఇంటెండ్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లా ఆఫీసులో యూరియా ఒక్కో లోడ్​కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుండగా.. డివిజన్, మండల అధికారులు అందినంత దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని మండలాల్లో అయితే ఒక్కో షాపునకు ఏడాదికి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.