హైదరాబాద్, వెలుగు: దండకారణ్యంలో నిఘా పెరగడంతో పలువురు మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఏపీ పోలీసులు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు మావోయిస్టులు అడవులను వీడి పట్టణాల్లో షెల్టర్ తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది.
ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను అప్రమత్తం చేశాయి. కాగా, మావోయిస్టులను లొంగుబాటు దిశగా నడిపిస్తున్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) అధికారులు.. చత్తీస్‌గడ్, ఒడిశా సరిహద్దు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మావోయిస్టులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ సహా రాష్ట్ర సరిహద్దుల్లోని పట్టణ ప్రాంతాల్లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశారు.
హిడ్మా ఎన్‌కౌంటర్‌తో అడవులను వీడి..
నంబాల కేశవరావు, హిడ్మా ఎన్కౌంటర్లు, కీల క నేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశించిన 27 మందిని విజయవాడలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మరికొంత మంది మావోయిస్టులు తెలంగాణలోని వివిధ పట్టణాల్లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఫలిస్తున్న రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ కేడర్‌కు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రజలకు సేవ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ మేరకు అండర్ గ్రౌండ్ కేడర్‌లో ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్కసెప్టెంబర్ 13న లొంగిపోగా.. మరో కీలక నేత సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అక్టోబర్ 29న జనజీవన స్రవంతిలో కలిశారు. వీరి తరహాలోనే మరికొంత మంది లొంగిపోయేందుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
