సాగుకు సిద్ధం .. 5.80 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

సాగుకు సిద్ధం .. 5.80 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు
  • అందుబాటులో 11 లక్షల విత్తన ప్యాకెట్లు, 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు 
  • ప్రణాళికలు రూపొందించిన వ్యవసాయ శాఖ అధికారులు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం సాగుకు సన్నద్ధమయ్యింది. ప్రతి ఏటా మే చివరి వారంలోనే రైతులు పత్తి విత్తనాలు విత్తుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొలం దుక్కులు ప్రారంభించారు. ఈ ఏడాది 5.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో‌ రైతులు పంట చేలను దున్నుకొని సాగుకు సిద్ధమవుతున్నారు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఉదయమే పంట పొలాలకు చేరుకొని చదును చేసి తుక్కు కాల్చేస్తున్నారు.

పత్తి విత్తనాలు రెడీ

జిల్లా వ్యాప్తంగా పత్తి పంట 4.40 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో సోయాబీన్​62,500 ఎకరాలు, 23 వేల ఎకరాల్లో మొక్క జొన్న, తదితర పంటలు సాగు చేయను న్నారు. దీంతో ఇటీవలే​పంట ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు.. విత్తనాలు, ఎరువులను సరిపడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. ఆయా కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశాలు నిర్వహించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు. గతంలో మాదిరిగా విత్తనాల కొరత ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. గతేడాది నకిలీ విత్తనాలతో చాలా మంది రైతులు నష్టపోగా ఈసారి ముందస్తుగా టాస్క్​ఫోర్స్​రెడీ అవుతోంది.

 ఈసారి రైతులకు 11 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరముండగా 7 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. సోయాబీన్, కంది, మొక్కజొన్న పంటలకు సంబంధించిన ప్యాకెట్లను సైతం మార్కెట్లో అందుబాటులో ఉంచాలని కంపెనీలకు అధికారులు సూచించారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్​ తదితర ఎరువులు 90 వేల మెట్రిక్​టన్నులు అవసరముండగా ప్రస్తుతం 45 వేల మెట్రిక్​ టన్నులు అందుబాటులో ఉంచారు. 

సాగు ప్రణాళిక సిద్ధం చేశాం

జిల్లాలో ఖరీఫ్​ పంటలకు సంబంధించిన ప్రణాళిక సిద్దం చేశాం. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయి. పత్తి విత్తనాలు 11 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా అంతకు మించి సరఫరా చేసేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. ఎరువుల కోటా మేరకు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

 శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఆదిలాబాద్

పంట    ఎకరాలు 

పత్తి    4.40 లక్షలు
సోయా    62,500
కంది    55,000
మొక్కజొన్న    23,000
జొన్న       1,600
వరి       1,900
పెసర           550
మినుము           550
ఇతర పంటలు           250