సర్జన్లంతా డీపీఎల్ చేయాల్సిందే

సర్జన్లంతా డీపీఎల్ చేయాల్సిందే

హైదరాబాద్‌‌, వెలుగు: ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని పూర్తిగా మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక నెలలో ఒక్క రోజు మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీల కోసం కేటాయించాలని భావిస్తున్నారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో సర్జన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం డాక్టర్లు అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి, ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ఆపరేషన్లు చేస్తున్నారు. ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి సర్జరీలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చాలని భావిస్తున్న అధికారులు.. అంతకంటే ముందు డబుల్ పంక్చర్ ల్యాపరోస్కోపిక్ సర్జరీ(డీపీఎల్‌‌) చేసేలా గైనిక్ సర్జన్లందరికీ ట్రైనింగ్ ఇప్పించనున్నారు. ఈ సర్జరీలు చేసేందుకు ప్రస్తుతం డాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇకపై ప్రతి సర్జన్‌‌ డీపీఎల్ సర్జరీలు చేసేలా ఓ రూల్‌‌ను తీసుకురానున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఒక్కో సర్జన్‌‌ నెలకు కనీసం పది డీపీఎల్ సర్జరీలు చేసేలా మరో నిబంధన తెచ్చే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నామన్నారు. దీంతో సర్జన్ల సంఖ్య పెరగడంతో పాటు వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. సర్జరీ తర్వాత హడావుడిగా పేషెంట్లను డిశ్చార్జ్ చేయకుండా, కనీసం ఒక్క రోజు హాస్పిటల్‌‌లోనే అబ్జర్వేషన్‌‌లో ఉంచాలన్న నిబంధన కూడా తెచ్చే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.