పెషావర్​ సూసైడ్​ బాంబర్​పై అధికారుల వివరణ

పెషావర్​ సూసైడ్​ బాంబర్​పై అధికారుల వివరణ

ఇస్లామాబాద్ : పెషావర్ పోలీస్​ లైన్​ మసీదు బాంబు పేలుడు ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, సూసైడ్ బాంబర్ వెనుక పెద్ద నెట్​వర్క్ ఉందని అక్కడి ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పోలీస్ డ్రెస్ వేసుకుని మసీదులోకి వచ్చాడని నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనలో 101 మంది చనిపోయారని అధికారులు ముందుగా ప్రకటించారు. తర్వాత గురువారం ఈ సంఖ్యను 84కు సవరించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో కొందరు హాస్పిటల్​లో రెండు సార్లు రిజిస్ట్రేషన్​ చేసుకోవడం కారణంగానే ఈ తప్పు జరిగిందని అధికారులు చెప్పారు. దాడికి సంబంధించిన కీలక విషయాలను ఖైబర్ పఖ్తున్‌‌ఖ్వా ఐజీ మొజ్జామ్ జా అన్సారీ గురువారం వెల్లడించారు. ‘‘హై సెక్యూరిటీ జోన్​లో ఉన్న పోలీస్​ లైన్​లోకి సూసైడ్​ బాంబర్ పోలీస్ యూనిఫాం వేసుకుని మోటార్ సైకిల్​పై వచ్చాడు. హెల్మెట్, మాస్క్ పెట్టుకున్నాడు. పోలీస్​ డ్రెస్​ ఉండటంతో చెక్ పాయింట్​ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని చెక్ చేయకుండానే లోపలికి పంపించారు. ఖైబర్ రోడ్ గుండా అతడు పోలీస్​లైన్​ ఏరియాలోకి వచ్చినట్టు సీసీ టీవీ ఫుటేజ్​ ద్వారా తెలిసింది. మసీదుకు ఎలా వెళ్లాలో పాష్తూ లాంగ్వేజ్​లో అక్కడే ఉన్న హవాల్దార్​ను అడిగాడు. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్​ను ట్రేస్​ చేస్తున్నాం”అని అన్సారీ తెలిపారు.

మమ్మల్ని నిందించొద్దు

పాకిస్తాన్.. తన సొంత సమస్యలను తనే పరిష్కరించుకోవాలి. మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. సూసైడ్​ బాంబు జాకెట్ వల్ల రూఫ్​ కూలడం 20 ఏండ్లలో ఎప్పుడూ చూడలే. దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. పాకిస్తాన్​ ఇంటర్నల్​ ప్రాబ్లమ్స్​కు అఫ్గానిస్తాన్​ కారణం​ కాదు. ఇక్కడ టెర్రరిజానికి స్థానం లేదు. పొరుగు దేశాలతో మేం శాంతిగా ఉంటున్నాం. మా దేశం టెర్రరిజానికి కేంద్రమని కొందరు అంటున్నారు. అదే నిజమైతే.. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇరాన్​లకు కూడా టెర్రరిజం వ్యాపించేది.

–అఫ్గాన్​ తాలిబన్లు