వనదుర్గా పేరుతో కొత్త మండలం ఏర్పాటుపై కసరత్తు

వనదుర్గా పేరుతో కొత్త మండలం ఏర్పాటుపై కసరత్తు
  • వివాదాస్పదంగా పాపన్నపేట మండల విభజన  
  • వ్యతిరేకిస్తూ ఆందోళనలు, సంతకాల సేకరణ

మెదక్​ జిల్లాలో పెద్దదైన పాపన్నపేట మండలంలో ఏడుపాయల ప్రాంతం వాళ్లు తమకు సెపరేట్​ మండలం కావాలంటున్రు...  పాపన్నపేట ప్రాంతం వారు మాత్రం మండల విభజన వద్దంటున్రు... దీంతో కొత్త మండల ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. 


మెదక్/పాపన్నపేట, వెలుగు : పాపన్నపేట మండలంలో 36  గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా ఈ మండలాన్ని రెండుగా విభజించి ఏడుపాయల వనదుర్గా పేరుతో కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏడుపాయల కమాన్​ కేంద్రంగా ఎల్లాపూర్, శానాయిపల్లి, పొడిచన్​పల్లి, పొడిచన్ పల్లి తండా, గాంధారిపల్లి, లక్ష్మీనగర్, కొత్తపల్లి, యూసుఫ్ ​పేట, ఆరెపల్లి, కుర్తివాడ, నాగ్సాన్​పల్లి, కొడుపాక, చిత్రియాల్, అన్నారం, అబ్లాపూర్, గాజులగూడెం, ఎన్కెపల్లి గ్రామ పంచాయతీలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కోసం పంచాయతీరాజ్​ శాఖ అధికారులు ఆయా గ్రామ పంచాయతీ పాలకవర్గాల నుంచి తీర్మానాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే కొత్త మండలం ఏర్పాటును ఏడుపాయల ప్రాంత గ్రామాల ప్రజలు, నాయకులు స్వాగతిస్తున్నారు. వీలైనంత త్వరగా మండల విభజన చేయాలని కోరుతున్నారు. 

ప్రాధాన్యత కోల్పోతమంటున్న పాపన్నపేట వాసులు.. 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన ఏడుపాయలతో పాపన్నపేట మండలానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా ఏడుపాయల దేవాలయ పాలక మండలిలో మెజారిటీ డైరెక్టర్ పోస్టులు, చైర్మన్​ పదవి పాపన్నపేట మండల వాసులకే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఏడుపాయల వనదుర్గా పేరుతో కొత్త మండలం ఏర్పాటైతే పాపన్నపేట మండలం చిన్నగా మారడంతోపాటు, ఎక్కువ గిరిజన తండా పంచాయతీలు మిగలడంతో ఫండ్స్​ తక్కువగా వస్తాయని, దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని ఈ ప్రాంతం వారు అంటున్నారు. ఎక్కువ హైస్కూళ్లు కొత్త మండలం పరిధిలోకి వెళ్లనుండడంతో విద్యాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా పెద్దదైన కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం(ఎఫ్ఏసీఎస్​) కొత్త మండలంలోకి వెళ్లడం పాపన్నపేట ప్రాంత రైతులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందంటున్నారు. అంతేగాక ఏడుపాయల దేవాలయ పాలక మండలి డైరెక్టర్, చైర్మన్​ పదవుల విషయంలో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని పాపన్నపేట ప్రాంత వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ పదవుల్లో పాపన్నపేట ప్రాంతానికి చెందిన నాయకులే ఉండటంతో, రాజకీయ కారణాలతో ఉద్దేశ్య పూర్వకంగా మండలాన్ని విభజిస్తున్నారని ఆ ప్రాంత వాసులంటున్నారు. అందుకని మండల విభజనను పాపన్నపేట ప్రాంత గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అఖిల పక్షాల ఆధ్వర్యంలో పాపన్నపేట మండలాన్ని విభజించొద్దంటూ ధర్నా, రాస్తారోకో, మండల కేంద్రం బంద్​ నిర్వహించారు. గ్రామాల్లో సంతకాల సేకరణ చేస్తున్నారు. మంగళవారం పాపన్నపేట ప్రాంత వాసులు కలెక్టరేట్​కు తరలివెళ్లి మండలాన్ని విభజించొద్దని కోరుతూ అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​  కు  వినతి పత్రం అందజేశారు. 

రాజకీయ లబ్ధికోసమే

కొందరు నాయకులు స్వార్థ రాజకీయాల కోసం కలిసి మెలిసి ఉన్న పాపన్నపేట మండలంలోని  గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రాజకీయ లబ్ధికోసం మండలాన్ని విభజించాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. 

– శ్రీనివాస్, ఎంపీటీసీ, పాపన్నపేట


నిర్ణయం మర్చుకునే వరకూ ఉద్యమం

ఎంతో ఘన చరిత్ర కలిగిన పాపన్నపేట మండలాన్ని రెండుగా విభజించడం దారుణం. ఈ ప్రక్రియను వెంటనే ఆపేయాలి. ఈ నిర్ణయం మార్చుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. నిరాహార దీక్షలకైనా తాము సిద్ధమే.

– శ్రీకాంత్, పాపన్నపేట