కడెం ప్రాజెక్ట్​ సేఫ్టీ పై అధికారుల దృష్టి

 కడెం ప్రాజెక్ట్​ సేఫ్టీ పై అధికారుల దృష్టి
  • నిపుణుల సూచనల పేరకు 36 ప్రతిపాదనలు 

నిర్మల్​జిల్లాలోని కడెం ప్రాజెక్టు రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేందుకు కసరత్తు జరుగుతోంది.  ఇటీవల వరదలతో ప్రాజెక్ట్​భారీగా దెబ్బ తిన్నది. దీంతో  ప్రాజెక్ట్​ సేఫ్టీ పై అధికారులు దృష్టి పెట్టారు. జాతీయ సంస్థలకు చెందిన ఎక్స్​పర్ట్స్ ప్రాజెక్ట్​ను సందర్శించి తిరిగి వరదలొచ్చినా ప్రాజెక్ట్​కు గానీ, దిగువ ప్రాంతాల ప్రజలకు గానీ ఎలాటి నష్టం కలుగకుండా ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్లాన్​ రెడీ చేశారు. 

నిర్మల్,వెలుగు: ఇటీవల వరదలతో భారీగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును పూర్తిగా ఆధునీకరించడంతో పాటు మళ్లీ వరదలొస్తే  ప్రమాదం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై సెంట్రల్​ డిజైన్​ఆర్గనైజేషన్​నిపుణులు పలు ప్రతిపాదనలు చేశారు. వీటిని ప్రభుత్వం ఆమోదించి, నిధులు కేటాయిస్తే వరద ముప్పు  శాశ్వతంగా తొలగిపోనుంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్​ తో పాటు ​ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్​ ఆఫీసర్లు కడెం ప్రాజెక్టును ఇటీవల సందర్శించారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి పలు సిఫార్సులు చేశారు. కడెం ప్రాజెక్టు ను సపోర్టు ఫర్​ ఇరిగేషన్​ మాడ్రనైజేషన్​ ప్రోగ్రామ్ ( సింప్​​) పరిధిలోకి చేర్చి రూ. 225 కోట్లతో  ప్రతిపాదనలు తయారు చేశారు. డీఆర్​ఐపీ స్కీమ్​కింద  రూ. 16.6కోట్లతో కూడా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

కొత్తగా 5 గేట్లు 

వరద ప్రమాదాన్ని నివారించేందుకు సెంట్రల్​ డిజైన్​ఆర్గనైజేషన్​ ఆఫీసర్లు పలు సూచనలు చేశారు.  వారి సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు అధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  కొత్తగా 5 వరద గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.  కడెం ప్రాజెక్టు 18 గేట్ల ద్వారా వరద నీటిని కిందికి వదులుతుంటారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఈ గేట్ల ద్వారా ఇన్​ఫ్లోకు తగ్గట్టుగా నీటిని బయటకు పంపడం సమస్యగా మారుతోంది.  ఇందులో 9 జర్మనీ గేట్లు  ప్రతిసారీ సతాయిస్తుండడంతో వాటిని తొలగించి ఇండియన్​ గేట్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా మరో 5 గేట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో మొత్తం 23 గేట్ల ద్వారా వరదనీటిని వేగంగా దిగువకు వదలడం సాధ్యమవుతుందని అంటున్నారు.  ప్రాజెక్ట స్పిల్​వే సామర్థ్యాన్ని పెంచేందుకు ప్లాన్ చేశారు. దీనివల్ల వరద నీరు దిగువకు వదిలే సమయంలో ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. 

‘సింప్’​ కింద  కడెం ఎంపిక

సెంట్రల్​ వాటర్​ కమిషన్​ ఆధ్వర్యంలో అమలవుతున్న సపోర్ట్​ ఫర్​ ఇరిగేషన్​ మాడ్రనైజేషన్​ ప్రోగ్రామ్​(సింప్​) కింద కడెం ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ స్కీమ్​కు ఆసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆర్థిక సహాకారం అందిస్తోంది.  సింప్​ కింద  కడెంతో పాటు జూరాల, ఎస్సారెస్పీలను కూడా సీడబ్ల్యూసీ పరిశీలించింది.  ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న రిపోర్ట్​ల ఆధారంగా కడెంను ఎంపిక చేసింది. ఆఫీసర్లు రెడీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే రూ. 225 కోట్లు మంజూరవుతాయి.   మెయిన్​ కెనాల్​ను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడంవల్ల వరద నీరు వేగంగా కిందికి వెళ్తుంది. దీంతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, కాలువల లైనింగ్​ పనులు కూడా చేపట్టనున్నారు. 

ప్రతిపాదనలు పూర్తి చేశాం

కడెం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రెడీ చేశాం. సింప్​ కింద 36 పనులకు రూ. 225 కోట్లతో ప్లాన్​ రెడీ చేసి.. పంపాం. ఇప్పటికే గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. ఇటీవల ఇంజనీర్​ ఇన్​ చీఫ్​, సెంట్రల్​ డిజైన్​ఆర్గనైజేషన్​, స్టేట్​ డ్యాం సేఫ్టీ ఆఫీసర్లు ప్రాజెక్టును సందర్శించి ఆధునికీకరణకు సంబంధించి సూచనలు చేశారు.

- సుశీల్​ కుమార్​, ఎస్​ఈ, ఇరిగేషన్​