ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి : బి. బాల మాయాదేవి

ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి : బి. బాల మాయాదేవి

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఓటర్ జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని ఖమ్మం జిల్లా ఎలక్టోరల్  రోల్ పరిశీలకులు, చీఫ్ రేషనింగ్ అధికారి బి. బాల మాయాదేవి అధికారులకు సూచించారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి ఎస్ఎస్ఆర్-2024కు సంబంధించి ఓటరు జాబితా రూపకల్పనపై ఆర్వోలు, ఏఆర్వోలతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్- 2024 ప్రక్రియలో ప్రతి అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫొటో సిమిలర్ ఎంట్రీ, డేమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీ విషయమై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం జిల్లాలో చేపడుతున్న ఎస్ఎస్ఆర్-2024 ప్రక్రియపై కలెక్టర్​ వివరించారు. ఓటరు జాబితాలో సుమోటోగా సవరణలు చేశామన్నారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్ల విషయంలో ఫారం-7 ద్వారా దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. 31 పోలింగ్ కేంద్రాల పేరు మార్పుకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఈపీ రేషియో 699గా ఉన్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్  కార్యాచరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ స్థాయిలో ప్రతీ బుధవారం,  జిల్లా స్థాయిలో ప్రతీ గురువారం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సమావేశంలో అడిషల్​​ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవోలు జీ. గణేశ్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, జిల్లా ఉపాధికల్పన అధికారి కే. శ్రీరామ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, వైరా, మధిర, సత్తుపల్లి మండల తహసీల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగసూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

3న మెగా జాబ్ మేళా

రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఫిబ్రవరి 3న నిర్వహించే మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మెగా జాబ్ మేళా కు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో చేపట్టబోయే మెగా జాబ్ మేళా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు కలెక్టర్​ తెలిపారు.

మిగతా వివరాలకు 8886711991, 9642333668 ఫోన్​ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కే. శ్రీరామ్, అదనపు పౌరసంబంధాల అధికారి వి. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.